బయోమెడికల్‌ వ్యర్థాలు..ప్రాణాంతక వ్యాధులు | Bio Medical Waste Causes Health Problems | Sakshi
Sakshi News home page

బయోమెడికల్‌ వ్యర్థాలు..ప్రాణాంతక వ్యాధులు

Published Wed, Dec 5 2018 1:46 PM | Last Updated on Wed, Dec 5 2018 1:46 PM

Bio Medical Waste Causes Health Problems  - Sakshi

మనం ఏదైనా ఆసుపత్రికి వెళితే వైద్యులు వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకుని రమ్మంటారు.. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్‌ వేస్తారు.. వీటి కోసం వినియోగించిన సిరంజిలను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రాణాంతకం. వాటిని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయో మెడికల్‌ వ్యర్థ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు ఇవ్వాలి. కొందరు వైద్యులు కక్కుర్తి పడి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్వాహకులకు వ్యర్థాలు ఇవ్వడం లేదు. రోడ్లపై, చెత్త కుండీల్లో పడేస్తున్నారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బందికి ఈ వ్యర్థాలను ఇస్తుండటంతో పెను ప్రమాదం పొంచి ఉందంటున్నారు పర్యావరణ వేత్తలు. జిల్లాలో 200కు పైగా చిన్న, పెద్ద ఆసుపత్రులు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. 

ప్రొద్దుటూరు టౌన్‌ : మనుషులకు, జంతువులకు రోగనిర్ధారణ కోసం ఉపయోగించిన సింరజిలు, సెలైన్‌ బాటిళ్లు, రక్తపు బ్యాగ్‌లు, కట్టు గుడ్డలు, శరీరంలోని వివిధ రకాల అవయవాలు ఇవన్నీ బయో మెడికల్‌ వ్యర్థాలుగా పరిగణించారు. అనంతపురం జిల్లాలో ఉన్న  శ్రవన్‌ ఎన్విరాన్‌మెంట్‌æటెక్నాలజీస్‌ అనే బయో మెడికల్‌ వ్యర్థ రహిత ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు ఈ వ్యర్థాలను ఇవ్వాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిర్ణయించింది. అనంతపురం జిల్లాతోపాటు వైఎస్సార్‌ జిల్లాలోని ఆసుపత్రుల నుంచి వచ్చే బయో మెడికల్‌ వ్యర్థాలను ఈ సంస్థకు చెందిన వాహనాల్లో ప్రతి రోజు తీసుకెళుతున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో 550కిపైగా ఆసుపత్రులు, రక్తపరీక్ష ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో 340 ఆసుపత్రులు, ల్యాబ్‌ల నుంచి వ్యర్థాలను ఈ ప్లాంట్‌ ప్రతినిధులకు ఇస్తున్నారు. మరో 200 ఆసుపత్రులు, ల్యాబ్‌లు వ్యర్థాలను వీరికి ఇవ్వకుండా రోడ్లపై, చెత్త కుండీల్లో, మున్సిపల్‌ చెత్త వాహనాల్లో వేస్తున్నారు.

జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్స్‌...
జిల్లాలోని రాజంపేట మున్సిపాలిటీలో 14, రాయచోటిలో 10, లక్కిరెడ్డిపల్లెలో ప్రభుత్వాసుపత్రి, వేంపల్లి 3, పులివెందుల 16, జమ్మలమడుగు 15, మైదుకూరు 5, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రితో పాటు
మరో 110 ప్రైవేటు ఆసుపత్రులు, కడప కార్పొరేషన్‌ 140, బద్వేలు  20, కోడూరు 10 ఆసుపత్రులు, ల్యా బ్‌లు బయోమెడికల్‌ వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ప్లాం ట్‌కు ఇస్తున్నాయి. ఇవి కాక మరో 200లకు పైగా ఆసుపత్రులు, ల్యాబ్‌లు బయో మెడికల్‌ వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. అలాగే జిల్లాలోని మరో 60 పీహెచ్‌సీల వ్యర్థాలను కూడా ట్రీట్‌ మెంట్‌ప్లాంట్‌కు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డీఎంఅండ్‌ హెచ్‌ఓకు లేఖలు ఇచ్చారు. కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు బయోమెడికల్‌ వ్యర్థాలను నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు. ఈ నీటిలోని దోమ ల వల్ల కానీ, ఈ నీరు భూమిలోకి ఇంకడం వల్ల కానీ పెను ప్రమాదం ఏర్పడుతుందన్న విషయం తెలిసి కూడా ఏ శాఖ దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.
 
కంపోస్టు యార్డులో వ్యాపిస్తున్న వైరస్‌...
మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో బయో మెడికల్‌ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది కంపోస్టు యార్డు కు తీసుకెళుతున్నారు. బయోమెడికల్‌ వ్యర్థాలపై ఉన్న వైరస్, చెత్తలో కలిసి మరింత పెరుగుతోంది. పారిశుద్ధ్య సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రుల నిర్వాహకులు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి బయో మెడికల్‌ వ్యర్థాలను వాహనాల్లో వేసుకునే సమయంలో సిరంజిలు చేతులకు, కాళ్లకు గుచ్చుకుంటున్నా పట్టించుకోవడం లేదు. వారికి తెలియకుండానే భయంకరమైన జబ్బుల బారినపడే ప్రమాదం ఉందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. కేవలం చెత్తను తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా పర్యవేక్షణ అధికారులు లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

ఆసుపత్రులను తనిఖీ చేసిన సీనియర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌..
కొద్ది రోజుల కిందట కడప, ప్రొద్దుటూరుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను కర్నూలు రీజియన్‌ సీనియర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ జనార్ధన్‌ పరిశీలించారు. చాలా ఆసుపత్రుల్లో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిబంధనలు పాటించని విషయంపై వైద్యులను ప్రశ్నించారు. కొందరు బయో మెడికల్‌ వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు ఇవ్వడం లేదని చెప్పారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగానికి డబ్బులు ఇచ్చి, ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ వారికి డబ్బు ఇవ్వాలంటే భారంగా మారిందని చెప్పడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే కడపలోని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయగా ప్రొద్దుటూరులోని 10 ఆసుపత్రులకు మరో రెండు రోజుల్లో నోటీసులు రానున్నాయి. 

ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు చెల్లించే ఫీజు ఇలా...
ప్రతి రోజు జిల్లాకు  బయోమెడికల్‌ వ్యర్థాలను తీసుకెళ్లేందుకు మూడు ప్రత్యేక వాహనాలు వస్తున్నాయి. ఒక్క ప్రొద్దుటూరు నుంచి అరటన్నుకుపైగా వ్యర్థాలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వ్యర్థాలను వేరు చేస్తే టన్నుకు పైగా రావాల్సి ఉంది. ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ నిర్వాహకులు ల్యాబ్‌కు రూ.600, డెంటల్‌ ఆసుపత్రి నుంచి రూ.500, ఆసుపత్రిలో 50 బెడ్‌లు ఉంటే రూ.5000, 100 బెడ్‌లు ఉంటే రూ.10వేలు, ఇలా రూ. 500 నుంచి ఫీజు తీసుకుంటున్నాయి. ఒక్క రోజు వాహనం ఏ కారణం చేతనైనా రాక పోతే మరుసటి రోజు రెండు రోజుల వ్యర్థాలను తీసుకెళుతున్నా ఆ రోజు ఫీజును ఆసుపత్రుల నిర్వాహకులు ఇవ్వడం లేదని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మూడు రకాల డబ్బాల వినియోగం ఎక్కడ...
నిబంధనల ప్రకారం ప్రతి ఆసుపత్రిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులు కలిగిన డబ్బాలను విని యోగించాలన్న నిబంధనలు ఆసుపత్రులు పక్కన పెట్టాయి. కనీసం డస్టు బిన్స్‌ కూడా లేని ఆసుపత్రులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అవగాహన లేమితో...
ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బయోమెడికల్‌ వ్యర్థాలపై అవగాహన లేకపోవడం వల్లకూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. కొందరు సిరంజిలు, సెలైన్‌ బాటిళ్లు, విక్రయానికి తీసుకెళుతుండగా, మరి కొందరు ఆపరేషన్‌కు వినియోగించిన వస్తువులు నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు.

పసుపు రంగు డబ్బాలో..

  • శరీర అవయవ భాగాలు, డ్రైసింగ్, గాజ్, దూది, పట్టీలు ఈ డబ్బాలో వేయాలి
  • మావి, ప్లాసెంటా, గర్భాశయం, అపెండిక్స్‌  కంతులు తదితరాలు
  • వ్యాధి నిర్ధారణ కణజాల నమూనాలు(బయాస్పీ స్పెసిమెన్‌)
  • ఆటోక్లేవ్‌ చేసిన తర్వాత బ్లడ్‌ బ్యాగులు
  • ఆపరేషన్‌లో తొలగించిన అవయవాలు
  • డ్రెస్సింగ్‌ ప్యాడ్‌లు, బ్యాండేజీలు, దూది స్వాబ్‌లు, శానిటరీ ప్యాడ్‌లు, రక్తం, చీముతో తడిచిన ఏదైనా దూదిబట్ట, గాజ్‌ వంటి వ్యర్థాలు
  • సిమెంట్‌ పట్టీలు
  • వ్యాధి నిర్ధారణ తరువాత మిగిలిన మానవ శరీర వ్యర్థాలు (చీము, రక్తము, మలము, మూత్రము, కంతుల ముక్కలు)
  •  సైటో టాక్సిక్, యాంటిబయోటిక్స్‌ వయర్స్, (సగం వాడిన, కాలం చెల్లినవి)

తెలుపు డబ్బాలో...

  • పదునైన వ్యర్థాలన్నింటినీ ఈ డబ్బాలో వేయాలి
  • ఈ డబ్బాలో 10 శాతం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రవం కలిపి ఉంచాలి
  • ఇంజక్షన్లు సూదులు
  • ఇంజక్షన్‌మందు ఉంటే పగిలిన వయల్స్‌
  • పగిలిన ఆంప్యూల్స్‌
  • సూక్ష్మదర్శినిలో వాడే పగిలిన స్లైడ్స్‌
  • ఆపరేషన్‌లో కుట్లు వేసేందుకు ఉపయోగించిన సూదులు
  • షేవింగ్‌ బ్లేడులు
  • శస్త్రచికిత్సలో ఉపయోగించే రెండంచుల పదునైన కత్తులు, పరికరాలు
  • రోగితో సంబంధం కలిగిన గాయపరిచే పదునైన వస్తువులు

నీలం రంగు డబ్బాలో.. 

  • రబ్బర్, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ముక్కలుగా కత్తిరించి ఈ డబ్బాలో వేయాలి
  • మూత్రాన్ని బయటకు తీసే క్యాథిటర్స్‌
  • రోగికి వాడిన ఇతర ప్లాస్టిక్‌ గొట్టాలు
  • రైల్స్‌ ట్యూబులు
  • ముక్కు విరిచిన ప్లాస్టిక్‌ సిరంజిలు
  • మూత్రపు సంచులు
  • ఐవి సెట్స్‌
  • చేతి గొడుగులు, గ్లౌజ్‌
  • ఆఫ్రాన్‌లు
  • డయాలసిస్‌ సామగ్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement