ఈ దీపావళికి మోత మోగించారు.. | PCB Report on Diwali Pollution Percentage in Hyderabad | Sakshi
Sakshi News home page

మోత మోగింది! ఢాం..ఢాం

Published Wed, Oct 30 2019 1:37 PM | Last Updated on Sat, Nov 2 2019 10:54 AM

PCB Report on Diwali Pollution Percentage in Hyderabad - Sakshi

సనత్‌నగర్‌: నగరంలో ఈసారి దీపావళికి టపాసుల మోత మోగింది. పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా నగరవాసులు వినిపించుకోలేదు. ఫలితంగా గతేడాది దీపావళి రోజు కంటే ఈసారి కాలుష్యం అధికంగా నమోదైంది. రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్‌.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పరిమితికి మించి ధ్వని కాలుష్యం నమోదు కాగా, గాలిలో కాలుష్య ఉద్గారాల పరిమితి పెరిగింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దీపావళికి సంబంధించిన ప్రాథమిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. నివాస ప్రాంతాల్లో గతేడాది ధ్వని కాలుష్యం సరాసరిన (ఉదయం 6–రాత్రి 10) 64 డెసిబెల్స్‌ నమోదైతే... ఈసారి అది 69 డెసిబెల్స్‌కు పెరిగింది.

నిబంధనల మేరకు రెసిడెన్షియల్‌ప్రాంతాల్లో 55 డెసిబెల్స్‌కు మించరాదు. వాణిజ్య ప్రాంతాల్లో గతేడాది 71 డెసిబెల్స్‌ నమోదైతే.. ఈసారి 72 డెసిబెల్స్‌కు పెరిగింది. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో 65 డెసిబెల్స్‌కు మించరాదు. ఇక పారిశ్రామిక ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తర్వాత టపాసుల మోత మోగిందని నివేదిక పేర్కొంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు 64 డెసిబెల్స్‌ ఉంటే... ఆ తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల వరకు 71 డెసిబెల్స్‌కు పెరిగింది. గతేడాది ఈ ప్రాంతాల్లో రాత్రి 10గంటల తర్వాత 66 డెసిబెల్స్‌గా ఉంది. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు పరిగణనలోకి తీసుకుంటే గతేడాది కంటే 7 డెసిబెల్స్‌ తగ్గడం గమనార్హం. కమర్షియల్‌ ప్రాంతా ల్లో రాత్రి 10 తర్వాత 70 డెసిబెల్స్‌కు మించ రాదు. 

పీఎం10 రెట్టింపు   
శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమయ్యే పీఎం 10 ఉద్గార స్థాయి ఊహించని రీతిలో పెరిగినట్లు పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో సగటున 85 ఉంటే దీపావళి రోజున 163 మైక్రోగ్రాము/క్యూబిక్‌ మీటర్‌గా నమోదైంది. అంటే సాధారణ రోజుల్లో కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నమోదైంది. పీఎం 10 గతేడాది దీపావళికి 140 మైక్రోగ్రాము/క్యూబిక్‌ మీటర్‌ నమోదు కాగా... ఈసారి అదనంగా 23 మైక్రోగ్రాము/క్యూబిక్‌ మీటర్‌ మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. వాస్తవానికి గాలిలో పీఎం10 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 100 మైక్రోగ్రాములు/క్యూబిక్‌ మీటరు మించరాదు. ఇక పీఎం 2.5 మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2018లో 95 మైక్రోగ్రాము/క్యూబిక్‌ మీటర్‌గా ఉంటే... ఈసారి 71.6 గా నమోదైంది. పీఎం 2.5 ఉద్గార స్థాయి 24 గంటల పాటు సగటున 60కి మించరాదు. 

పెరిగిన ఎన్‌ఓఎక్స్‌  
కళ్లు, ముక్కు మండేలా చేసే ఆక్సైడ్స్‌ ఆఫ్‌ నైట్రోజన్‌ (ఎన్‌ఓఎక్స్‌) గతేడాది కంటే పెరిగింది. 2018లో 43.5 మైక్రోగ్రాము/క్యూబీక్‌ మీటర్‌ నమోదు కాగా.. ఈసారి 65కు నమోదైంది. ఇక శ్వాసకోశ, బ్రాంకైటీస్, చికాకును కలిగించే సల్ఫర్‌ డయాక్సైడ్‌ (ఎస్‌ఓ2) గతేడాది కంటే కాస్త తగ్గడం ఊరటనిచ్చింది. 2018లో 7.6 నమోదు కాగా.. ఈసారి 6.0 నమోదైంది. 

అందుకే పెరిగిందా?  
ఓవైపు కాలుష్యం పెరగ్గా... మరోవైపు టపాసుల విక్రయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదు కావడానికి కారణం గాలిలో ఆర్ధ్రత (తేమ శాతం) ఎక్కువగా ఉండడమేనని తెలుస్తోంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు టపాసుల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు త్వరలో గాలిలో కలసిపోయే ఆస్కారం ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లో చుట్టుముట్టడంతో కాలుష్యం ఎక్కువగా నమోదైందని పేర్కొంటున్నారు. గతేడాది గాలి వేగం 1.6 మీటర్స్‌/సెకనుగా ఉండగా... ఈసారి 0.5 మీటర్స్‌/సెకనుకు పడిపోయింది. 

సనత్‌నగర్‌లో అత్యధికం..   
ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ను పరిశీలిస్తే అత్యధికంగా సనత్‌నగర్‌లో 361, బొల్లారంలో 300 నమోదైంది. ఈ మేర స్థాయి ఆరోగ్యానికి హానికరమని పీసీబీ పేర్కొంది. ఇక సున్నిత (సెన్సిటివ్‌) ప్రాంతాల్లోనూ కాలుష్య ఉద్గారాలు వెలువడ్డాయి. హెచ్‌సీయూ వద్ద 170, జూపార్కు వద్ద 113 నమోదైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement