అలర్ట్‌ హైదరాబాద్‌.. ఢాం ఢాం బంద్‌! | Hyderabad Police Ban Pollution Crackers on Diwali | Sakshi

భార లోహాలున్న బాణసంచా విక్రయిస్తే కేసులే

Oct 23 2019 8:40 AM | Updated on Oct 31 2019 12:37 PM

Hyderabad Police Ban Pollution Crackers on Diwali - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ధ్వని కాలుష్యం వెదజల్లే క్రాకర్స్‌కు ఈ దీపావళికి చెక్‌ పడనుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణ హననానికి కారణమవుతున్న భారలోహాల ఆనవాళ్లున్న ఈ టపాసులను అమ్మడం, పేల్చడం చేయరాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. తాజాగా పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) సైతం ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. లెడ్, లిథియం తదితర భారలోహాలున్న టపాసుల మోత కారణంగా సమీపంలోని పెట్రోలు బంకులకు ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న క్రాకర్స్‌ విక్రయించేవారి గుట్టురట్టు చేసేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. తమ పరిశీలనలో ఇలాంటి క్రాకర్స్‌ పట్టుబడితే సదరు విక్రయదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ప్రధానంగా చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రాకర్స్‌లోనే భారలోహాల ఆనవాళ్లు బయటపడుతుండడంపై నగరవాసులు, పర్యావేరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అనర్థాలెన్నో...  
లెడ్, లిథియం, యాంటీమోనీ, మెర్క్యురీ, ఆర్సినిక్‌ తదితర భారలోహాలతో తయారుచేసే ఫైర్‌క్రాకర్స్, మ్యూజికల్‌ క్రాకర్స్, లూనార్‌ రాకెట్స్‌ ఇతరత్రా... టపాసులు పేల్చేవారికి కొద్దిసేపు ఆనందం కలిగించినా, తద్వారా వెలువడే శబ్ద, వాయుకాలుష్యం నగర పర్యావరణ హననానికి కారణమవుతోంది. అంతేకాదు మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావాలు చూపడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా అత్యధిక ధ్వనులు వెలువడే క్రాకర్స్‌ కారణంగా కర్ణభేరికి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇక అత్యధిక కాలుష్యం వెదజల్లే ఈ క్రాకర్స్‌ నుంచి వెలువడే పొగ ద్వారా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరిస్థితులు మృగ్యమవుతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశాలకు, కళ్లకు పొగబెట్టే ఈ క్రాకర్స్‌కు చెక్‌ పెట్టాలని సూచిస్తున్నారు. 

విదేశీ వద్దు...  
హైదరాబాద్ నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న టపాసులు విక్రయించే దుకాణాలను గుర్తించేందుకు పీసీబీ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. వీటిని విక్రయిస్తూ పర్యావరణ హననానికి కారణమవుతున్న వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానంగా విదేశాల నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే టపాసుల్లోనే వీటి ఆనవాళ్లుంటున్నాయని చెబతున్నారు. ఈసారి దివ్వెల పండగను అన్ని వర్గాలు కాలుష్య రహితంగా జరపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవాళీ టపాసులు కాల్చుకోవాలని సూచిస్తున్నారు. 

ఆ రోజే అధికం..   
సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజున నగర వాతావారణంలో వివిధ రకాల కాలుష్యకారకాల మోతాదు రెట్టింపవుతున్నట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరుగుతున్నట్లు పీసీబీ వెల్లడించింది.  సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు దీపావళికి ముందు, తరువాత 15 రోజుల వరకు నగరంలో శబ్ద, వాయుకాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి నివేదిక అందజేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement