
గజమాలతో ఎమ్మెల్యే దంపతులను సన్మానిస్తున్న టీఆర్‌ఎస్ యూత్ నాయకులు
పాలకుర్తి: ప్రజలు మెచ్చే పనులు చేస్తూ 25 ఏళ్లుగా వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ రికార్డు నెలకొల్పానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని బషారత్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యం లో బుధవారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో 63 కిలోల భారీ కేక్ కట్ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దంపతులను గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి మాట్లాడుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడుసార్లు ప్రజలు ఆదరించారని, ఉమ్మడి జిల్లాలో ఒకసారి ఎంపీగా గెలిపించారని అన్నారు. పాలకుర్తిలో ప్రజలు కష్ట కాలంలో ఆదరించి గెలిపించారని, మరోసారి పాలకుర్తి నుంచి పోటీ చేసి గెలుస్తానన్నారు. జనగామ లేదా మరో నియాజకవర్గానికి వెళ్తారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డానని, ఇక నుంచి కార్యకర్తలను ఆదుకోవడంలో శ్రద్ధ చూపుతానని అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం రాని వారికి ప్రైవేట్ కంపనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
ఎర్రబెల్లి ట్రస్టు చైర్‌పర్సన్ ఎమ్మెల్యే సతీమణి ఉషాదయాకర్‌రావు, టీఆర్‌ఎస్ యువజన విభాగం నియోజకవర్గ నాయకులు పసునూరి నవీన్, గడ్డం రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, మాజీ అధ్యక్షుడు ముస్కు రాంబాబు, శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహా దేవస్థానం చైర్మన్ రాంచంద్రయ్యశర్మ, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ విజయ, టీఆర్‌ఎస్ నాయకులు మురళీధర్‌రావు, మాచర్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.