వేళ్లు విరిచి, చేతులు మడిచి వైద్యం | Bizarre Treatment | Sakshi
Sakshi News home page

 వేళ్లు విరిచి, చేతులు మడిచి వైద్యం

Published Fri, May 4 2018 1:51 PM | Last Updated on Fri, May 4 2018 1:51 PM

Bizarre Treatment - Sakshi

వైద్యం చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న డీఎస్పీ శిరీష

వికారాబాద్‌: పూర్వకాలం నాటి వైద్యం పేరుతో బీపీ,షుగర్, పక్షవాతం వంటి రోగాలను  నయం చేస్తామంటూ ఓ ఘరానా ముఠా మోసానికి పాల్పడింది. ఆ ముఠాతో స్థానికంగా ఉండే కొం దరు వ్యక్తులు ఓ గ్రూపుగా ఏర్పడి ఈ శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. గురువారం పట్టణంలోని బసంత్‌ ఫంక్షన్‌ హాలులో ఈ సంఘటన వెలుగు చూసింది. కర్ణాటక రాష్టం లోని బళ్లారికి చెందిన నూర్‌ మహమ్మద్‌ అలీ అనే వ్యక్తి అక్కడ కొంత కాలంగా బీపీ, షుగర్, పక్షవాతం వంటి రోగులకు చేతి వేళ్లు విరవడం, అరచేతిలో గట్టిగా నొక్కడం, చేతిని మోచేతి వరకు వంచి రోగం నయమవుతుందని చెబుతూ..

ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేసి నట్లు తెలిసింది. ఈ రోగాలతో ఇబ్బంది పడుతున్నజిల్లా వాసులు కొందరు బల్లారి వరకు వెళ్లి ఇతడి వద్ద వెద్యం చేయించుకున్నారు. రోగుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న స్థానికులు కొం దరు ఓ గ్రూపుగా ఏర్పడి నూర్‌ మహ్మద్‌ అ లీని ఈ వైద్యం చేయించేందుకు వికారాబాద్‌కు తీసుకొచ్చేలా పథకం వేశారు. ఈ గ్రూపులోని ప్రతిసభ్యుడు వారికి కలిసిన  అందరికీ ఈ వైద్యం గురించి చెప్పడంతో పాటు, ఆ డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకదని, తాము త్వరగా ఇప్పిస్తామని కూడా ప్రచారం చేశారు.

గత పదిహేను రోజులుగా చాప కింద నీరులా ప్రచారం చేశారు. దీంతో ఏదో రకంగా రోగం నయమవుతుందనే ఆశతో మధ్యవర్తుల మాటలు నమ్మి వేల మంది ఈ శిబిరానికి వచ్చారు. ఇదే ముఠా నెల రోజుల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ   వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడికి సుమారు 5,300 మంది రోగులు వచ్చి వేళ్లు విరిపించుకొని రూ.500 ఫీజుగా చెల్లించారు. ఆ రోజు రోగుల నుంచి సుమారు రూ.40లక్షలు వసూళ్లు చేసినట్లు సమాచారం.

రోగుల నుంచి వసూళ్లు చేసిన దాంట్లో నూర్‌ మహ్మద్‌కు రూ.300, శిబిరం నిర్వహించిన వారికి రూ.200 తీసుకున్నట్లు సమాచారం. ఈ శిబిరంతో డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో పట్టణానికి చెందిన ఆ గ్రూప్‌ ఈ శిబిరాన్ని గురువారం   మరోసారి నిర్వహించారు. పలు రోగాలతో  బాధపడుతున్న అనేక మంది వేలల్లో ఇక్కడకు వచ్చారు. ఉదయం 6గంటలకే వరుసలో నిలబడి బళ్లారి డాక్టర్‌ వద్ద చేతులు విరిపించుకోవడం ప్రారంభించారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వికారాబాద్‌ డీఎస్పీ శిరీష అక్కడికి వెళ్లి వైద్యం చేస్తున్న వ్యక్తి అర్హత గురించి అడుగగా ఆయూష్‌ వైద్యంలో నిష్ణాతుడినని ధ్రువీకరణ పత్రాలు చూపించే ప్రయత్నం చేశాడు. అవన్నీ ఓపెన్‌ యూనివర్సిటీకి సంబంధించినవే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భారతదశ ప్రాచీన నాటు వైద్యం తాము చేస్తున్నట్లు వివరించే ప్రయత్నం చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో జనాలను రప్పించినప్పుడు కనీసం పోలీసు అనుమతి తీసుకోవాలనే విషయం తెలియదా..? అని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచినీటి సౌకర్యం లేదు, పైగా తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. దీంతో స్థానికంగా శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులు సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సమయంలో శిబిరం నిర్వాహకులు,  గ్రూప్‌ సభ్యులు కొందరు అక్కడికి వచ్చిన రోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైద్యం చేస్తున్న వ్యక్తిని డీఎస్పీ ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వలేక పోయాడు. గ్రూపులోని కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి తమకు షుగర్, బీపీ వంటివి తక్కువయ్యాయని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వైద్యాలను నమ్మవద్దని పోలీసులు అక్కడి వచ్చిన జనాలను పంపించేశారు. గురువారం  నిర్వహించిన ఈ శిబిరంలో కూడా భాదితుల నుంచి సుమారు రూ.40లక్షలు వసూళ్లు చేసినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement