న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేద మహిళల ఉసురు పోసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన ఆయన.. నిజామాబాద్ పట్టణంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేద మహిళల కోసం కేంద్ర అవాస్ యోజన పథకం కింద ఎన్ని ఇళ్లు ఇచ్చిందన్న విషయం గురించి.. అర్వింద్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ వాటిని పక్కదారి పట్టించారని ఆరోపించారు.
‘‘కేసీఆర్ పేద ప్రజలకు శాపంగా మారారు. ఈ పథకము కింద కేంద్రం ఇచ్చిన వేల కోట్లు నిధులను పక్కదారి పట్టించారు. ఇంకా నిధులు రావాల్సి ఉన్నా.. వివరాలు ఇవ్వకుండా వాటిని నిలిపివేసుకున్నారు. 2016-17లో మొదటి విడత కింద కేంద్రం 190.79 కోట్ల రూపాయలు ఇస్తే... ఒక్క మహిళకు కూడా ఇల్లు కట్టించలేదు. ఈ పథకం కింద ఎన్ని ఇళ్లు కట్టించారు... ఎన్ని నిధులు ఖర్చు చేశారో గత నాలుగేళ్లలో కనీస వివరాలు కూడా ఇవ్వలేదు’’ అని అర్వింద్ పేర్కొన్నారు.
అదే విధంగా హౌజింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్రం తరుపున కనీసం ఒక మంత్రి లేదా అధికారి కూడా హాజరు కాలేదని మండిపడ్డారు. ‘‘మేము పర్యటనకు వెళ్తే మహిళలు ఇల్లు కావాలని అడిగేవారు. నిజానికి రెండు దఫాలలో డబుల్ బెడ్ రూమ్ హామీ వల్లనే టీఆర్ఎస్ గెలిచింది. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం లేదు. పక్క రాష్ట్రాల్లో ఈ పథకం కింద వేల ఇళ్లు కట్టుకున్నారు. కేసీఆర్ మాత్రం ప్రాజెక్టులు కట్టడానికి లక్షల కోట్లు లోన్ తెచ్చుకుంటున్నారు. ఈ పథకం డబ్బులతో ప్రగతి భవన్ కట్టించుకున్నారు. ఆయన కోసమైతే ఆరు నెలలో ఇల్లు పూర్తి అయితది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తా అని చెప్పారు. ఆ ఇళ్ల ముందు గొర్రెలు, బర్రెలు, ఆయన కొడుకును కట్టేసుకుకోవచ్చు అని పెద్దగా మాట్లాడారు. ఇళ్లు కట్టకపోయినా... కట్టామని చెబుతున్నారు. నిజంగా ఇళ్లు కడితే మరి ఎక్కడ కట్టారు.. గాల్లో కట్టారా...? లేదా ఆయన ఫామ్ హౌజ్‌లో కట్టారా..?’’ అని అర్వింద్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment