నల్లబజారుకు.. నీలి కిరోసిన్ | blue kirosene to black bajaru | Sakshi
Sakshi News home page

నల్లబజారుకు.. నీలి కిరోసిన్

Published Mon, Jun 30 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

నల్లబజారుకు.. నీలి కిరోసిన్

నల్లబజారుకు.. నీలి కిరోసిన్

- చౌకధరల దుకాణాల్లో రెండు నెలలకోసారి సరఫరా చేస్తున్న కిరోసిన్
- నిత్యవసర సరుకుల పరిస్థితీ అంతంతే
- మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు

 గిద్దలూరు: చౌకధరల దుకాణాల ద్వారా పేదలకందించే నిత్యవసర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. అరకొర వస్తువులు సరఫరా చేస్తున్నా.. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. డీలర్లు రెండు నెలలకు ఒకసారి ఒకనెల కిరోసిన్ పంపిణీ చేస్తూ..అందులోనూ సగం పక్కదారి పట్టిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్డుదారులు దీనిపై అధికారులను నిలదీసినా పట్టించుకున్న పాపాన పోలేదు.  నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 194 రేషన్‌షాపులుండగా అందులో 65,500 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా లక్షా 31 వేల లీటర్ల కిరోసిన్ సరఫరా అవుతుంది. గిద్దలూరు మండలంలో ఉన్న 25 వేల రేషన్‌కార్డులకు 50 వేల లీటర్ల కిరోసిన్ ప్రతినెలా కేటాయిస్తారు. ఇందులో 50 శాతం కార్డుదారులకు కూడా కిరోసిన్ సక్రమంగా అందడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం కిరోసిన్ పంపిణీపై నెలకొక విధానాన్ని అమలు చేయడ మూ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
- మొదట దీపం గ్యాస్‌దారులకు కిరోసిన్ నిలిపేశారు. తిరిగి గ్యాసు కార్డుదారులకు రెండు లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లోలీటరు, గ్యాస్ లేని వారికి రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ కార్డుదారులకు కిరోసిన్ సక్రమంగా వచ్చిన దాఖలాల్లేవు.
- మొదట మండల కేంద్రాల్లో నాలుగు లీటర్లు పోయాలన్నారు. తరువాత నాలుగు నుంచి రెండు లీటర్లకు కుదించారు. ప్రస్తుతం అది కూడా అమలు కావడం లేదు.
- ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మరింత అధ్వానంగా తయారైంది. దీనిపై కార్డుదారులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులు చేయడం, రేషన్ కార్డులు రద్దు చేయించడం జరుగుతోంది. సదరు డీలర్లకు రాజకీయ నాయకుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు.
 
29వ తేదీన కిరోసిన్ సరఫరా:
కిరోసిన్ హోల్‌సేల్ డీలర్లు చౌకధరల దుకాణాలకు ప్రతి నెలా సరఫరా చేయాల్సి ఉన్నా రెండు నెలలకొకసారి నెలాఖరులో కిరోసిన్‌ను సరఫరా చేస్తున్నారు. దీంతో ఒక నెల కిరోసిన్‌ను పక్కదారి పట్టించి హోల్‌సేల్ డీలర్ టోకుగా అమ్మేసి స్థానిక అధికారులకు, డీలర్లకు కొంత ముట్టచెబుతూ తన జేబులు నింపుకుంటున్నాడు. ఈనెలలో కిరోసిన్ ఎందుకు రాలేదని కార్డుదారులు డీలరును ప్రశ్నిస్తే తహశీల్దారును అడగమని, తహశీల్దారును అడిగితే స్టాకు రాలేదంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఇందుకు కారణం మార్కెట్లో నీలి కిరోసిన్ ధర లీటర్ రూ.40 నుంచి రూ.45 వరకు పలకడమే. డీలర్‌కు లీటరు కిరోసిన్‌ను రూ.14.75కు హోల్‌సేల్ డీలర్లు సరఫరా చేస్తున్నారు. దానిని రూ.15 కు కార్డుదారులకు విక్రయించాలి. లీటరు కిరోసిన్ కార్డుదారులకు విక్రయిస్తే డీలర్‌కు వచ్చేది 25 పైసలు మాత్రమే. అదే కిరోసిన్‌ను పక్కదారి పట్టిస్తే లీటరుకు రూ.25 నుంచి రూ.30 వస్తాయి. దీంతో డీలర్లు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
 
అవినీతి జరుగుతోందిలా...

- కిరోసిన్‌ను డీలరుకు పోసే సమయంలో విధిగా రూట్ అధికారి ఉండాలి. కానీ, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. రూట్ అధికారికి అందేది అందుతుండటంతో వారు నోరు మెదపడం లేదు.
- గిద్దలూరు ప్రాంతంలో ప్రతినెలా సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను రెండు నెలలకు ఒకసారి ఒక నెల కిరోసిన్‌ను అదీ నెలాఖరులో సరఫరా చేస్తున్నారు.
- ట్యాంకరు నుంచి డీలరు తనకు కేటాయించిన కిరోసిన్‌లో సగమే తీసుకుని మిగిలిన కిరోసిన్‌ను అందులోనే ఉంచేసి హోల్‌సేల్ డీలరుకు అమ్మేసుకుంటాడు.  ఇలా మిగిలిన కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది.
- ట్యాంకర్ ద్వారా రాత్రిపూట కిరోసిన్ చౌకదుకాణాలకు సరఫరా అవుతోంది. కిరోసిన్ సరఫరా జరిగిన మరుసటి  రోజు తనిఖీ చేస్తే డీలర్ల అవినీతి బయటపడుతుంది.
- తహశీల్దార్ కార్యాలయంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ ఖర్చంతా తామే భరించాల్సి ఉంటుందని, ఇది కాక నెల వారీ చెల్లింపులు ఉంటాయని, ఇదేమీ రహస్యం కాదని డీలర్లు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి లొసుగుల వలన అధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో డీలర్ల అవినీతి పెచ్చుమీరుతోంది.
- డీలర్లు అక్రమంగా తరలించే సరుకులను పోలీసులు పట్టుకుంటే తప్ప రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వయానా పట్టుకున్న పాపానపోలేదు. ఇలా డీలర్లు, రెవెన్యూ అధికారులు కార్డుదారులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు.
 
 ఏఎస్‌ఓ వివరణ:
 ఈ విషయమై జిల్లా ఏఎస్‌ఓ ఖాదర్‌మస్తాన్‌ను వివరణ కోరగా ట్యాంకర్ వెంట కచ్చితంగా రూటు ఆఫీసర్‌గా ఆర్‌ఐ వెళ్లాల్సి ఉందని, కిరోసిన్ లోడ్ కావడం ఆలస్యమైందన్నారు. ప్రతినెలా నెలాఖరులోగా కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలన్నారు. ఈవిషయం తన దృష్టికి రాలేదని.. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement