బోరు.. భోరు!
♦ 190 బోర్లు.. 170 ఫెయిల్
♦ రంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామ ప్రజల భగీరథ యత్నం
♦ రూ.లక్షలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్న రైతులు
వికారాబాద్ రూరల్: పాతాళగంగను పైకి తెచ్చేందుకు రైతన్నలు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఫలించడం లేదు. తిండి గింజలైనా పండించుకుందామని అప్పులు తెచ్చి వేస్తున్న బోర్లు.. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో రైతులు ఆరు నెలలుగా 190 బోర్లు వేస్తే అందులో 170 బోర్లు పూర్తిగా ఫెయిలయ్యాయి. మరో 15 బోర్లలో అరకొర నీళ్లు పడ్డాయి. ఒక రైతును చూసి మరో రైతు బోర్లను వేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కానీ నీళ్లు మాత్రం పడడం లేదు. వాల్టా చట్టం ప్రకారం.. బోరుకు బోరుకు మధ్య సుమారు 100 మీటర్ల దూరం ఉండాలి.. కానీ ఈ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలోనే సుమారు 10 బోర్లు కూడా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బల్జ వీరప్ప, బుచ్చమ్మల కుమారుడు మల్లేశం తన పొలంలో రూ.4 లక్షలు ఖర్చు చేసి ఏడు బోర్లు వేశాడు. వాటిల్లో కేవలం ఒక్క బోరులోంచి అరకొర నీరు వస్తోంది. ఇదే రైతు రూ.నాలుగు లక్షలు ఖర్చు చేసి బావినీ తవ్వించాడు. అయినా ఫలితం లేదు. మరో రైతు యాదవరెడ్డి తన పొలంలో ఏకంగా తొమ్మిది బోర్లు వేశాడు. కేవలం ఒక్క బోరు మాత్రమే పనిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామానికి చెందిన బోజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎర్రవల్లి భుజంగరెడ్డి, పాండురంగారెడ్డి, టి.సంజీవరెడ్డి, శ్రీనివాస్‌లతోపాటు చాలా మంది రైతులు వారివారి పొలాల్లో రెండు నుంచి ఐదు బోర్ల వరకు వేయించారు. వీరిలో చాలా మంది జియాలజిస్టు అభిప్రాయం తీసుకుని మరీ బోర్లు వేసిన వాళ్లే. వేస్తున్న సమయంలో కొన్ని బోర్లలో నీళ్లు పడుతున్నా.. పది నుంచి 15 రోజుల వ్యవధిలో అవి వట్టిపోతున్నాయి. యాలాల మండలం నుంచి పులుమద్దికి వచ్చిన ఓ బోరువెల్ యజమాని 15 రోజుల్లో బోర్లు వేసి సుమారు రూ.కోటి ఆదాయం సమకూర్చుకున్నాడని రైతులు తెలిపారు.
రూ.4 లక్షలు నష్టపోయాం
మా పొలంలో ఏడు బోర్లు వేసినం. ఒకే ఒక్క బోరులోంచి నీళ్లు వస్తున్నయ్. ఉన్న మూడు ఎకరాల్లో టమాటా, క్యాబేజీతోపాటు ఇతర కూరగాయల పంటలు వేసినం. నీళ్లు సరిపోక అవి ఎండుతున్నయ్. బోర్ల వేసి రూ.4 లక్షలు నష్టపోయినం. మరో నాలుగు లక్షలు పెట్టి బాయి తవ్విచ్చినం. నీళ్లు పడలే.
- బల్జ బుచ్చమ్మ, పులుమద్ది, వికారాబాద్ మండలం
ఒకర్ని చూసి మరొకరు..
మా గ్రామంలో రైతులందరూ ఒకరి తర్వాత ఒకరు బోర్లు వేయబట్టిర్రు. దగ్గరదగ్గర్నే పది, పదిహేను బోర్లు వేస్తుం డ్రు. నేను కూడా రూ.70 వేలు ఖర్చు చేసి గతంలో బోరు వేసిన. నీళ్లు పడ్డయి. ఇప్పుడు దానికి దగ్గర్లనే వేరేటోళ్లు బోర్లు వేస్తున్నరు. మా బోర్ల నీళ్లు వట్టిపోయినయ్. వారం క్రితమే డ్రిల్లింగ్ చేయించిన. కొద్దికొద్దిగా నీళ్లు వస్తున్నయ్.
- శ్రీనివాస్, పులుమద్ది, వికారాబాద్ మండలం