ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు | CM YS Jaganmohan Reddy Launches YSR Jala Kala Scheme | Sakshi
Sakshi News home page

ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు

Published Tue, Sep 29 2020 3:20 AM | Last Updated on Tue, Sep 29 2020 3:22 PM

CM YS Jaganmohan Reddy Launches YSR Jala Kala Scheme - Sakshi

ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆన్‌లైన్‌ ద్వారా లేదా వలంటీర్ల ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్‌ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 

ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు. అందుకే రెండో బోరు కూడా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్‌ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయి స్తాము. వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. 
–సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అర్హులైన రైతులందరి పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటారు కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం దాదాపు మరో రూ.1,600 కోట్లు వ్యయం అవుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా అమలు చేస్తామన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికి ఏనాడూ అన్యాయం చేయదని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్‌ జలకళ’ పథకాన్ని సోమవారం ఆయన తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
‘వైఎస్సార్‌ జలకళ’ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, ఎంపీ, అధికారులు తదితరులు 

మాట నిలబెట్టుకుంటున్నాను
► రైతు కోసం మన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నాం. నా 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. 
► నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్‌ నియోజకవర్గాలు.. మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం.
► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే ఇది సాధ్యం అవుతోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్‌ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాము.

మరో అడుగు ముందుకు..
► నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము. తద్వారా లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి.
► రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటార్లు (పంపు సెట్లు) ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్‌ కావాలి. రోజుకు 9 గంటల సరఫరా అంటే ఒక్క రోజుకు మొత్తం 45 యూనిట్లు. ఇవాళ ఒక్కో యూనిట్‌ ధర రూ.6.87. ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9,274 మేర ప్రయోజనం కలుగుతుంది. 

ఫీడర్ల కెపాసిటీ పెంచాం
► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8,655 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టింది. అయినా చిరునవ్వుతో చెల్లించాం.
► రైతులకు పగలే ఉచితంగా 9 గంటలు విద్యుత్‌ ఇవ్వడం కోసం 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. తగిన మౌలిక వసతులు కల్పించాం. రానున్న రోజుల్లో మిగతా ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం. ఇందు కోసం గత 16 నెలలుగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. 

నాణ్యమైన విద్యుత్‌ కోసమే
► ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై విచిత్ర వాదనలు చేస్తున్నారు. లోడు తెలుసుకుని మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్త పడడం కోసమే మీటర్లు బిగించాలని నిర్ణయించాం. లోడు, ఓల్టేజీ ఎంతో స్పష్టంగా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్‌ను రైతుకు ఒక హక్కుగా ఇస్తాం.   
► రైతులు తమ చేతుల మీదుగా ఆ బిల్లులు కడతారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు నేరుగా అందిస్తుంది. అప్పుడు రైతులు నాణ్యమైన విద్యుత్‌ కోసం డిమాండ్‌ చేయవచ్చు. 
► రైతుల ఉచిత విద్యుత్‌ కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు రూ.2.50 మాత్రమే. అందువల్ల 30 ఏళ్లు క్వాలిటీ పవర్‌ ఇస్తాం.  

రైతుల కోసం ఎన్నెన్నో..
► గత ప్రభుత్వం వదిలి పెట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించాం.
► రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 సహాయం చేస్తున్నాం. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా ప్రీమియమ్‌ అమలు చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. గత ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. 
► ఆర్‌బీకేలు ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తున్నాం.  వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం.
► రాబోయే రోజుల్లో ఈ–క్రాపింగ్‌ ద్వారా రైతుల పొలం వద్దే పంటల కొనుగోలు జరుగుతుంది. ఆర్‌బీకేల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణ కోసం అసైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటు చేస్తాం. ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటవుతాయి. మండల కేంద్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. 
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, జి.జయరాం, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ పథకం రైతులకు ఎంతో మేలు  
ఎందరో సీఎంల వద్ద ఎమ్మెల్యేగా పని చేశాను. కానీ ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు నిలబెట్టుకున్న సీఎంను తొలిసారి చూస్తున్నాను. ఏ రాష్టంలో కూడా ఈ స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదు. వైఎస్సార్‌ జలకళ పథకం కింద ఇవాళ 2 లక్షల బోర్లు తవ్వబోతున్నాం. అన్ని జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఈ పథకం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.    
 – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

నిజంగా ఇది రైతు ప్రభుత్వం
వైఎస్సార్‌ జలకళ పథకంపై ప్రశంసలు
ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని పలువురు రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్‌ జలకళ పథకాన్ని సీఎం జగన్‌ సోమవారం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

ఎంతో ఉపయోగం
నేను చిన్న రైతును, రెండున్నర ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆ భూమిలో కొద్దిపాటి పంటలు వేసుకుని జీవిస్తున్నాను. ఈ మూడు నెలల తర్వాత మా పంటలకు నీరుండదు. అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మీ నిర్ణయం వల్ల మా లాంటి రైతు లెందరికో ఎంతో ఉపయోగం. బోర్లు వేయించడమే కాకుండా మా లాంటి వాళ్లకు మోటార్లు కూడా ప్రభుత్వమే బిగిస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. 
– సింహాచలం నాయుడు, కొమరాడ మండలం, విజయనగరం 

ఆనందంగా ఉంది
నేను గతంలో కూలి పనికి వెళ్లే దాన్ని. నాకు ప్రభుత్వమే 2.70 ఎకరాల భూమి ఇచ్చింది. ఇందులో కరువు పనుల కింద చెట్లు, రాళ్లు తీసి ఇచ్చారు. మామిడి మొక్కలు కూడా ఇచ్చారు. నాకు రైతు భరోసా కూడా వచ్చింది. మీ పథకాల పుణ్యమా అని నా ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా బోర్‌ వేసి, మోటార్‌ బిగిస్తామంటే చాలా సంతోషంగా ఉంది.    
– లక్ష్మీదేవి బాయి, దండరాయిపల్లి తండా, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం

మీ దయతో చిన్న రైతునవుతున్నా 
నాకు కొద్ది పాటి పొలం ఉంది. అయితే దీని వల్ల లాభం లేకపోవడంతో ఉపాధి హమీ పనులతో బతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఉచితంగా బోరు తవ్వించి.. ఉచితంగా మోటారు బిగించి.. ఉచితంగా విద్యుత్‌ కూడా ఇస్తామని చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు జీవితకాలం రుణపడి ఉంటాం. ఇది నిజంగా రైతు ప్రభుత్వం. నేను ఎప్పటికీ ఉపాధి కూలీగా మిగిలిపోతానేమో అనుకున్నా. కానీ మీ దయతో చిన్న రైతుగా మారుతున్నాను.         
    – గురుస్వామి, పులిచర్ల మండలం, చిత్తూరు 

దేశం అంతా మీ వైపు చూస్తోంది
వైఎస్సార్‌ జలకళ ద్వారా మీరు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారనడంలో సందేహం లేదు.   మీరు రెండు అడుగులు కాదు.. మూడు అడుగులు ముందుకు వేశారు. అడక్కుండానే మీరు రైతులకు వరాలిస్తున్నారు. మీరు అధికారంలోకి రాగానే వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. రైతు పక్షపాతిగా ఉన్న మీ ప్రభుత్వం పదికాలాల పాటు కొనసాగాలి. దేశం అంతా మీ వైపు చూస్తోంది. 
    – డి.ఏసుపాదం, తిరువూరు మండలం, కృష్ణా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement