’బాస్’ గిమ్మిక్కులు | boss tryingto escape from cash for vote case | Sakshi
Sakshi News home page

’బాస్’ గిమ్మిక్కులు

Published Sat, Jun 20 2015 2:12 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

’బాస్’ గిమ్మిక్కులు - Sakshi

’బాస్’ గిమ్మిక్కులు

- ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకునేందుకు బాబు యత్నాలు
- ఏసీబీ విచారణకు హాజరుకావొద్దంటూ సండ్రపై ఒత్తిడి
- తన సలహాదారుగా ఫోరెన్సిక్ నిపుణుడి నియామకం
- ‘తెలంగాణ’ కాల్‌డేటా ఇవ్వాలంటూ మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు.. పరాకాష్టకు చేరిన అధికార దుర్వినియోగం
- కీలక వివరాలు వెల్లడించకుండా సండ్రకు ‘శిక్షణ’
- బెజవాడకు తరలింపు.. అధికారుల ఆధ్వర్యంలో తర్ఫీదు
- ఫోరెన్సిక్ నిపుణుడి నియామకంపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు
- ఫోరెన్సిక్ డెరైక్టరేట్‌లో కట్టుదిట్టమైన చర్యలు
 
సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి ఎలాగైనా బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ‘అన్ని’ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడుగడుగునా అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏపీ పోలీస్ అధికారులను అడ్డంగా వాడేసుకుంటున్నారు. ఏసీబీ విచారణకూ అడ్డుపడే యత్నం చేస్తున్నారు.

తాజాగా శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను డుమ్మా కొట్టించడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం ఐజీ శివధర్‌రెడ్డిల కాల్‌డేటా కోసం మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిడి తేవడం, ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీ గాంధీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం వంటివన్నీ అందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలను చూసి ప్రజలు, ఏపీ పోలీస్ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం.
 

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి పెద్దఎత్తున డబ్బు డ్రా చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య నుంచి వాస్తవాలు రాబట్టాలన్న ఏసీబీ యత్నానికి చంద్రబాబు, ఆయన కోటరీ అడ్డుపడినట్లు ప్రచారం జరుగుతోంది. సండ్రను విచారిస్తే తమ బండారం బయటపడుతుందని భావించిన ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ మాజీ సభ్యుడొకరు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

గురువారం దాకా విశాఖపట్నంలోని తన కుమారుడి వద్ద ఉన్న సండ్ర శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చి ఏసీబీ విచారణకు హాజరుకావాలని భావించారు. కానీ ఆయన హాజరుకాకుండా అడ్డుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ సహచరుడు ఒకరికి ఫోన్ చేసి సండ్రను నిలువరించాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు సండ్రను రోడ్డు మార్గంలో శుక్రవారం ఉదయం విజయవాడకు తరలించాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే విచారణకు హాజరుకాకపోతే తన తప్పు అంగీకరించినట్లు అవుతుందని అంతకుముందు సండ్ర ఆ ఇద్దరు టీడీపీ రాజ్యసభ సభ్యులతో వాదించినట్లు తెలిసింది. కానీ వారు బెంబేలెత్తి చంద్రబాబు ద్వారా సండ్రను నిలువరించగలిగారు.

ముందు జాగ్రత్తగా..
అవినీతి కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏపీ పోలీసులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్యకు పోలీస్ ఇంటరాగేషన్‌పై శిక్షణ ఇప్పించే బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించినట్లు తెలిసింది. ఏసీబీ విచారణకు హాజరుకావడానికి ముందు ఆయనకు ఇంటరాగేషన్‌పై తర్ఫీదు ఇవ్వాలని చంద్రబాబు ఆ అధికారిని ఆదేశించారు.

ఇలాంటి కేసుల విచారణలో ఆరితేరిన ముగ్గురు సీనియర్ అధికారులు శుక్రవారం సాయంత్రం నుంచే ఈ శిక్షణ మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు అనుసరించిన మార్గాలు-వాటిపై ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో వారు విశదీకరిస్తారు. దాదాపు మూడు రోజుల పాటు సండ్రకు ఈ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడా చిన్న పొరపాటు కూడా తలెత్తకుండా, పొరపాటున కూడా ఆయన ఎవరి పేర్లు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకునేలా లోక్‌సభ మాజీ సభ్యుడొకరు దగ్గరుండి ఈ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. తాను వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని ఏసీబీకి రాసిన లేఖలో పేర్కొన్న సండ్ర... తాను ఏఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదీ చెప్పలేదు.

దీంతో విచారణాధికారికి పూర్తి వివరాలు ఇవ్వకుండా చట్టాన్ని ఉల్లంఘించడంపై సండ్రపై మరో కేసు నమోదు చేసే అవకాశముంది. సండ్ర తన రెండు ఫోన్లను స్విచాఫ్ చేసుకోవడం కూడా ఏసీబీ నోటీసును పట్టించుకోలేదన్న భావన కలిగించడమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక సండ్ర గత వారం రోజులుగా ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు వంటి వివరాలను ఏసీబీ ఎప్పటికప్పుడు సేకరిస్తూనే ఉంది.

అచ్చంగా లంచం కేసు చుట్టే..
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్, నిఘా విభాగం అధిపతి శివధర్‌రెడ్డిల కాల్‌డేటా ఇవ్వాలంటూ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు మొబైల్ ఆపరేటర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టుకు వారం ముందు నుంచి అరెస్టయ్యాక వారం వరకూ వారి ఫోన్ నంబర్లకు సంబంధించిన కాల్‌డేటా కావాలని కోరుతున్నారు. ఈ కాల్‌డేటా ప్రముఖులది కావడంతో ఇచ్చేందుకు మొబైల్ ఆపరేటర్లు ససేమిరా అన్నారు. కాల్‌డేటా ఇవ్వాలంటూ ఏపీ సీఎం నుంచే తమకు ఒత్తిడులు వస్తున్నాయంటూ వారు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.

మరోవైపు వ్యక్తిగతంగా తాను కేసు నుంచి బయటపడే మార్గాల అన్వేషణకు చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకేజుగుప్స కలిగిస్తోంది. ‘వారం రోజులుగా మాకు మరో పనే లేకుండా పోయింది. అచ్చంగా లంచం కేసు చుట్టే మేం పరిభ్రమిస్తున్నాం..’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మామూలుగా కాల్ డేటా తీసుకోవడం తమకు సమస్య కాదని, అవినీతి కేసు బయటపడిన తరువాత ఇలా కాల్‌డేటా అడగడమే ఇబ్బందిగా మారిందని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాగోలా తప్పించుకునేందుకే..
నామినేటెడ్ ఎమ్మెల్యేతో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన వ్యవహారంలో వీడియో, ఆడియో రికార్డులకే అత్యధిక ప్రాధాన్యత. రేవంత్ లంచం ఇవ్వజూపిన వీడియోతో పాటు, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో రికార్డులు ఇప్పుడు హైదరాబాద్ ఫోరెన్సిక్ డెరైక్టరేట్‌లో ఉన్నాయి. అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి వాటిని పరీక్షిస్తున్నారు. నెలాఖరులోగా కోర్టుకు నివేదిక ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం మాజీ డెరైక్టర్, నిపుణుడు కూడా అయిన కేపీసీ గాంధీని ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం రాజకీయ, అధికారవర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అనుమానితులెవరినీ వీడియో, ఆడియో ఫుటేజీలను పరీక్షించే ప్రదేశాలకు అనుమతించవద్దని ఆదేశించింది. కేసు నుంచి బయటపడే మార్గాల అన్వేషణలో భాగంగానే గాంధీ నియామకం జరిగిందని అధికారవర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

ఇంత తెంపరితనమా..?
 - ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను ‘ఎలాగైనా’ గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ వేశారు.
 - తెలంగాణలోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.5కోట్లు ముడుపులు ఇవ్వజూపారు.. మిగతా వారికి మరింత భారీగా ‘ఆఫర్’ చేశారు. రూ.100కోట్లు ఖర్చుచేసి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 - దీంతోపాటు ఏపీలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రూ.150కోట్లదాకా సమకూర్చుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
 - ఈ సొమ్ము కోసం అడ్డదారులు తొక్కారు.. పారిశ్రామికవేత్తల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
 - ఐదారుగురు ఎమ్మెల్సీల కోసమే రూ.150కోట్ల ఖర్చుకు సిద్ధం కావడంతో గత ఏడాదిగా మరెంతో ‘భారీగా’ అవినీతి జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
 - నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు లంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.
 - ఈ వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారించింది. బండారం బయటపడడంతో బాబు ఎదురుతిరిగారు. ‘ట్యాపింగ్’ అంటూ అవాస్తవ ఆరోపణలతో అడ్డుకోజూశారు. ఆ యత్నం ఫలించకపోయేసరికి.. అధికార దుర్వినియోగానికి దిగారనే ఆరోపణలు వస్తున్నాయి.
 - కేసు నుంచి బయటపడేందుకు అనేక రోజుల పాటు పోలీస్ ఉన్నతాధికారులను చంద్రబాబు తన నివాసానికే పరిమితం చేశారు.
 - తాజాగా ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిన ఎమ్మెల్యే సండ్రను అడ్డుకుని, విజయవాడకు తరలించినట్లు ఏసీబీ గుర్తించింది.
 - ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక కీలకం కావడంతో ఆ రంగానికి చెందిన నిపుణుడిని ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement