బాబు బండారం బట్టబయలు
మహానాడు నుంచే కుట్ర.. ఎమ్మెల్యేల కొనుగోలుకు అక్కడ్నుంచే స్కెచ్
'ఓటుకు కోట్లు' కేసు అనుబంధ చార్జిషీట్‌లో సంచలనాత్మక అంశాలు
- చంద్రబాబు నేతృత్వంలో కొనుగోలు కమిటీ సమావేశం
- ముగ్గురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ఆదేశించిన బాబు
- ఆ పనిలోనే రేవంత్, సండ్ర, సెబాస్టియన్ బిజీబిజీ
- క్యాంప్ కోసం నోవాటెల్‌లో తొమ్మిది గదులు బుక్ చేసిన ఎర్రబెల్లి
- దయాకర్‌రావు రూంలు బుక్ చేసినట్లు హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ వాంగ్మూలం
- మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ట్రాప్ చేసిన బాబు వర్గం
- రేవంత్ పట్టుబడటానికి ముందురోజు స్టీఫెన్‌సన్ ఇంట్లో పోలీసుల తనిఖీలు
- చంద్రబాబు ఆఫర్ నచ్చిందని సెబాస్టియన్‌కు చెప్పిన స్టీఫెన్‌సన్
- సంభాషణల్లో పదేపదే చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిందన్న ఏసీబీ
- నిందితుల్లో బాబును ఎందుకు చేర్చరని న్యాయ నిపుణుల ప్రశ్న
సాక్షి, హైదరాబాద్
ఓటుకు కోట్లు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో తన పాత్ర లేదని ఒకసారి, తన ఫోన్ ట్యాప్ చేశారని మరోసారి చెప్పుకుంటూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి పాత్రను ఏసీబీ ఎత్తిచూపింది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు.
ఇందులో ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సాగించిన సంభాషణలు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు మాట్లాడిన సంభాషణ, డీల్ కోసం సెబాస్టియన్–స్టీఫెన్‌సన్ సాగించిన పూర్తి సంభాషణలను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 136 పేజీలతో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో అడుగడుగునా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది.
మహానాడు కేంద్రంగా కుట్ర
2015 మే 28న మహానాడు కేంద్రంగా పలువురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు వర్గం స్కెచ్ వేసింది. దీనికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించింది. మహానాడుకు హాజరవుతూనే టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్, సండ్ర వెంకటవీరయ్యలు ఎమ్మెల్యే కొనుగోలు కోసం ప్రయత్నాలు సాగించారని, ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్‌డేట్ ఇస్తున్నారని చార్జిషీట్‌లో పేర్కొన్న సంభాషణల్లో ఏసీబీ పేర్కొంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్
2015 మే 25న ఎమ్మెల్యేల కొనుగోలుకు చంద్రబాబు ఆదేశించారు. క్రిస్టియన్ ఎమ్మెల్యే కావడంతో స్టీఫెన్‌సన్‌ను ట్రాప్ చేసేందుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ లీడర్ సెబాస్టియన్‌ను బాబు వర్గం రంగంలోకి దింపింది. ఇతడితో పాటు జెరూసలెం మత్తయ్య, జిమ్మీ, హెలెన్ బాబు గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీరితో ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య టచ్‌లో ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ విషయాన్ని సంభాషణల్లో సండ్ర, రేవంత్, సెబాస్టియన్లు స్పష్టం చేసుకున్నారు. మే 26 నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు.
మాజీ డిప్యూటీ సీఎంను కూడా..
మహానాడుకు బయలుదేరే ముందు చంద్రబాబు ఇంట్లో సమావేశం ఉంటుందని, అందులో ఎమ్మెల్యేల కొనుగోలుపై చర్చిస్తారని సెబాస్టియన్–సండ్ర మధ్య సంభాషణ జరిగింది. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ట్రాప్ చేసినట్టు ఎమ్మెల్యే సండ్ర.. సెబాస్టియన్‌కు స్పష్టం చేశారు. ఇందుకు ప్రత్యేకంగా వరంగల్‌లోని తమ క్రిస్టియన్ సెల్ పని ప్రారంభించినట్టు సండ్ర సంభాషణలో బయటపడింది. ఇక మరో ఇద్దరిలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ అని, ఇంకొకరు తనకు తెలియదని తెలిపాడు. మే 28న సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణలను ఏసీబీ తన చార్జిషీట్‌లో వివరించింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఏ2గా ఉన్న సెబాస్టియన్ మాట్లాడాడు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లాబీయింగ్‌లో 50 శాతం పని పూర్తయిందని సెబాస్టియన్.. సండ్రకు మెసేజ్ పంపించాడు.
అవి ఒరిజినల్ సంభాషణలే.. ఎఫ్‌ఎస్‌ఎల్ ధ్రువీకరణ
ఏసీబీకి కీలక ఆధారంగా మారిన సెబాస్టియన్ ఫోన్‌లో ప్రతీఫోన్ కాల్ సంభాషణలు రికార్డయ్యాయి. ఈ ఫోన్ ద్వారానే అటు రేవంత్, సండ్రకు.. ఇటు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సాగించిన సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) ద్వారా ఏసీబీ నివేదికలు తెప్పించుకుంది. దీంతో ‘బ్రీఫ్‌డ్ మీ కథ..’బయటపడింది. సెబాస్టియన్ తన ఫోన్ ద్వారా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఫోన్ చేసి ‘బాబు గారు.. మాట్లాడతారు.. లైన్‌లో ఉండండి..’అని చెప్పిన ఆడియో అసలుదేనని, ట్యాపింగ్ వల్ల రికార్డయ్యింది కాదని, ఎక్కడా కూడా ఎడిటింగ్ లేదని నివేదిక తెలిపింది. అది సెబాస్టియన్ ఫోన్‌లోనే రికార్డయ్యిందని సమయంతో సహా ఎఫ్‌ఎస్‌ఎల్ చెప్పిందని ఏసీబీ తన చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొంది. మే 29, 30, 31 తేదీల్లో సెబాస్టియన్ –స్టీఫెన్‌సన్ సంభాషణలపై పదేపదే చార్జిషీట్‌లో వివరాలను స్పష్టం చేసింది. మొత్తం 15 కాల్స్ ఈ మూడు రోజుల్లో ఉన్నాయని, ఇందులోనే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టు సంభాషణల్లో రికార్డయ్యిందని తెలిపింది.
స్టీఫెన్‌సన్‌తో బాబు సంభాషణ
సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలసి మే 30న చంద్రబాబుకు దగ్గరకు వెళ్లినట్టు సండ్ర–సెబాస్టియన్ ఫోన్ సంభాషణలో బయటపడింది. రేవంత్, సెబాస్టియన్ చంద్రబాబు పార్టీ ఆఫీస్‌లో ఉండగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో డీల్ కుదుర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. సెబాస్టియన్ తన ఫోన్ నుంచి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఫోన్ చేశారు. ‘బాబు గారు మాట్లాడతారు..’అంటూ ఫోన్ ఇచ్చినట్టు సంభాషణల్లో స్పష్టమైంది.
అదే రోజు స్టీఫెన్‌సన్ ఇంట్లో సోదాలు
మే 30న చంద్రబాబు తనతో మాట్లాడిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన ఇంట్లో పోలీసులు సోదాలు చేసినట్టు సెబాస్టియన్‌కు స్టీఫెన్‌సన్ ఫోన్‌లో తెలిపారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చామని, బీరువా, అల్మరాలు చెక్ చేసినట్లు తన భార్య ఫోన్‌లో చెప్పిందని సెబాస్టియన్‌కు స్టీఫెన్‌సన్ తెలిపారు. తనతోపాటు టీఆర్‌ఎస్‌లోని పలువురు ఎమ్మెల్యే ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారని సెబాస్టియన్‌కు వివరించారు.
నోవాటెల్‌లో క్యాంపు..
ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు కొనుగోలు చేయాల్సిన ఎమ్మెల్యేలతో క్యాంపు నడిపించేందుకు చంద్రబాబు వర్గం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు ఏసీబీ తన చార్జిషీట్‌లో వివరించింది. రేవంత్‌రెడ్డి–సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణల్లో క్యాంపు ఏర్పాట్లు, నోవాటెల్ కేంద్రంగా సాగిన వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్టు ఏసీబీ స్పష్టం చేసింది. స్టీఫెన్‌సన్‌ను తీసుకొని నోవాటెల్ హోటల్‌కు రావాలని ఎమ్మెల్యే సండ్ర, రేవంత్... సెబాస్టియన్‌కు సూచించారు. అయితే స్టీఫెన్‌సన్ అక్కడకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, ఇంట్లోనే కలుద్దామంటున్నారని సెబాస్టియన్ వారికి తెలిపాడు.
నోవాటెల్ బుక్ చేసిన ఎర్రబెల్లి
కొనుగోలు చేస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కోసం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నోవాటెల్‌లో 9 గదులను బుక్ చేసినట్టు ఆ హోటల్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ 2015 (మూడు రోజులు) 9 గదులు బుక్ చేసినట్టు నోవాటెల్ హోటల్స్ ఫైనాన్స్ డైరెక్టర్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. 109, 123, 131, 138, 140, 141, 225, 480, 646 నంబర్ రూములను బుక్ చేసినట్టు డైరెక్టర్ వెల్లడించారు.
22 సార్లు బాబు ప్రస్తావన
అనుబంధ చార్జిషీట్‌లో ఏసీబీ 22 సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించింది. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర, జెరూసలెం మత్తయ్య, ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌లు తమ సంభాషణల్లో పదే పదే చంద్రబాబు, బాబు, సర్.. అంటూ 22 సార్లు ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చంద్రబాబు పాత్ర కీలకమన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పైగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, ఆ మేరకు తాను నడుచుకుంటానని ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్.. సెబాస్టియన్‌తో మాట్లాడినట్టు సంభాషణల్లో స్పష్టంగా బయటపడింది. ఫిర్యాదుదారుడే స్వయంగా తన వాంగ్మూలంలో... చంద్రబాబు తనతో మాట్లాడారని, తనకు రూ.2 కోట్లతో పాటు ఇబ్బంది వస్తే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు చిక్కినట్టే అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.