
యాప్ పనిచేసే విధానాన్ని అడిషనల్ కమిషనర్‌కు వివరిస్తున్న ‘బౌన్స్’ ప్రతినిధులు (ఫైల్)
కంటోన్మెంట్: మెట్రో రాకతో నగరంలో రవాణా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చాయి. అయితే మెట్రో స్టేషన్లు తమ నివాసం, పనిచేసే కార్యాలయం, వ్యాపార సంస్థలకు అందుబాటులో ఉండే వారికి మాత్రమే మెట్రో బాగా కలిసొస్తుంది. మెజారిటీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు, లేదా నిర్దేశిత మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యం చేరుకునేందు మళ్లీ సిటీ బస్సు లేదా ఆటో, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద సైకిళ్లు, బైక్ రైడ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, అంత సౌకర్యంగా లేవు. ఈ గ్యాప్‌ను పూరించేందుకు కొందరు యువకుల మదిలో మెదిలిన సరికొత్త ఆలోచనే ‘బౌన్స్’.
మొబైల్ ఫోన్ ఉంటే చాలు
ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా చేరుకోలేని గమ్యానికి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏర్పడింది బౌన్స్. గోవాలోని పనాజీ వంటి నగరాల్లో ఇప్పటికే అద్దె బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఉన్న చోటుకు వెళ్లి అక్కడి నుంచి అద్దెకు తీసుకుని మళ్లీ వాటిని, తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ బైక్‌లు అందుబాటులో ఉండవు. ‘బౌన్స్’ ఈ లోటును పూరించింది. నగరంలో ఎక్కడైనా బైక్ అద్దెకు తీసుకుని మన గమ్యానికి చేరుకున్నాక, ఏదేని పార్కింగ్ ప్రదేశంలో వదిలేస్తే చాలు. మళ్లీ ఆ బైక్‌ను మనం తిరిగి అప్పగించాల్సిన పనిలేదు. తాళం వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మొబైల్‌లో ఉన్న యాప్ ద్వారా మన ట్రిప్ ముగిస్తున్నట్లు తెలియజేస్తే చాలు, సరదు కంపెనీ ప్రతినిధులే ఆన్‌లైన్‌లో బైక్‌ను లాక్ చేస్తారు. ఇక ఆ ప్రదేశంలో మరొకరు అదే బైక్‌ను తీసుకుని తమ రైడ్ ప్రారంభించవచ్చు. ఇలా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా సరే మన మొబైల్ ఫోన్‌లో ‘బౌన్స్’ యాప్ ఉంటే చాలు. మనకు సమీపంలో పార్కు చేసి ఉన్న వాహనాల వివరాలు అందులో ప్రత్యక్షం అవుతాయి. ఫోన్ యాప్ ద్వారానే సదరు బైక్‌ను స్టార్ట్ చేసుకుని మనకు కావాల్సిన చోటుకు వెళ్లి వదిలేయవచ్చు. మెట్రో ప్రయాణికులకు అత్యంత అనువుగా ఉండే ఈ తరహా రవాణా వ్యవస్థ మన నగరంలో శుక్రవారం ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద నగర అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
ఇవీ ప్రత్యేకతలు
♦ బౌన్స్ ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా కిలోమీటరుకు రూ.2 చొప్పున మాత్రమే చార్జ్ చేయనున్నారు. అయితే బైకును వినియోగించిన సమయానికి గానూ నిమిషానికి రూ.1.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
♦ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్సు కలిగిన ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో ‘బౌన్స్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ‘బౌన్స్’ వాహనాల్ని అద్దెకు తీసుకోవచ్చు. హెల్మెట్‌ను కూడా కంపెనీ వాళ్లే అందిస్తారు.
♦ ప్రస్తుతానికి టీవీఎస్ జెస్ట్, టీవీఎస్ పెప్ మోటార్ బైకులు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రికల్ వాహనాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
♦ తమ మొబైల్‌లో ఉన్న యాప్ ఆధారంగా ప్రయాణికులు తమకు సమీపంలో ఏవైనా బైకులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, వెంటనే బుక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి గమ్యస్థానికి చేరుకున్నాక సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ ప్రదేశంలో బైక్‌ను పార్కు చేసి వెళ్లిపోవచ్చు.
బుకింగ్ ఎలా అంటే..
♦ ప్లే స్టోర్ లేదా ఏదేని ఆన్‌లైన్ యాప్ స్టోర్ నుంచి ‘బౌన్స్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
♦ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ముందు, వెనక బాగాల ఫొటోలతో పాటు, ఫేస్ వెరిఫికేషన్ కోసం సెల్ఫీ పోటోను కూడా అప్‌లోడ్ చేయాలి.
♦ వినియోగదారుడి లైసెన్సు, ఫొటోను బౌన్స్ అప్రూవ్ చేశాక, వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు
♦ ‘బుక్ నౌ’ అనే బటన్ నొక్కితే సమీపంలో అందుబాటులో ఉన్న స్కూటర్, బైక్‌ల సమాచారం లొకేషన్‌తో సహా పోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఏదేని వాహనాన్ని బుక్ చేసుకున్నాక ఆ వాహనానికి సంబంధించిన ఆటోమెటిక్ లాక్ ఆన్ చేసి, బైక్‌కు ఉన్న బటన్ మీద నొక్కితే చాలు వాహనం స్టార్ట్ అవుతుంది.
♦ రైడ్ ముగించాక, మళ్లీ వెంటనే వినియోగించుకోవాలంటే పాస్ మోడ్‌లో పెడితే ఆటోమెటిక్‌గా లాక్ అవుతుంది. పాస్ మోడ్‌లో ఉన్న వాహనానికి అద్దె రేటు తక్కువగా ఉంటుంది.
♦ ఒక వేళ బైక్ మళ్లీ వెంటనే అవసరం లేదనుకుంటే, ఏదేని నిర్ధేశిత పార్కింగ్ ప్రదేశంలో వదిలిపెట్టి ఎండ్ రైడ్ నొక్కాలి. రైడ్‌కు సంబంధించిన పేమెంట్‌ను ఆన్‌లైన్‌లో చెల్లిస్తే సరిపోతుంది.
♦ ప్రయాణంలో వాహనం యాక్సిడెంట్‌కు గురైతే, వెంటనే బౌన్స్ కస్టమర్ కేర్‌కు సమచారం వెళుతుంది. వినియోగదారుడు వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment