
బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే..
‘మెట్రో’ వివాదంపై కేంద్రానికి తెలంగాణ సర్కారు వివరణ
ఎల్‌అండ్‌టీ రాసిన లేఖ లీక్ ఆంధ్రా లాబీ, మద్దతుదారుల కుట్ర
ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవు
ఎలాంటి అనుమతులు కూడా పెండింగ్‌లో లేవని వెల్లడి
నేడు కేంద్ర అధికారులతో సమీక్ష
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నష్టపరిచేందుకే ఎల్‌అండ్‌టీ రాసిన లేఖను ఆంధ్రా లాబీ లీక్ చేసిందని, అది కూడా వారికి మద్దతిస్తున్న వాళ్లకు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించింది. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు బి.వి. పాపారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ సేథ్, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేం దర్ మిశ్రాను వేర్వేరుగా కలసి మెట్రో వివాదంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఎల్‌అండ్‌టీ చేపట్టిన ఇతర ప్రాజెక్టులన్నింటి కంటే హైదరాబాద్ మెట్రో పనులు వేగంగా నడుస్తున్నాయని వారు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగానే ప్రాజెక్టు పురోగతిలో ఉందని వివరించారు. ఈ మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇటీవల వివాదాలు కమ్ముకున్న నేపథ్యంలో బి.వి.పాపారావు కేంద్ర అధికారులకు కూలంకషంగా దీనిపై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు పురోగతిని రాజీవ్‌శర్మ వివరిం చారు. ‘మెట్రో’కు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని, తమ తరఫు నుంచి అనుమతులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు.
అలాగే రాజీవ్‌శర్మ, పాపారావు సోమవారం సాయంత్రం రైల్వే బోర్డు అధికారులను కలిశారు. అంతకంటే ముందు సీఎస్ రాజీవ్ శర్మ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో భేటీ కాగా... ఈ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
నేడు మరో సమీక్ష!
సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్ ఎండీ గాడ్గిల్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ప్రాజెక్టు పరిస్థితిపై మంగళవారం సమీక్షించనున్నారు.
టేకోవర్ యోచనలో సర్కారు
మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ లేఖ రాయడంతో పాటు.. అలైన్‌మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వానికి, ఆ సంస్థకు తలెత్తుతున్న అభిప్రాయభేదాల నేపథ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి తప్పుకొంటామంటూ, ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ ఈ నెల 10న ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టీ రాసిన లేఖ లీక్ కావడంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తనతో భేటీ అయిన ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ గాడ్గిల్‌తో... ‘మీ నిర్ణయానికి స్వాగతం. మంచిది..’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ మెట్రో గురు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వవర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రో రెండో దశపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావులు కేంద్ర కేబినెట్ కార్యదర్శితో మాట్లాడినప్పుడు.. ఈ టేకోవర్ ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. అలాగే మెట్రోకు సంబంధించిన ఒకరిద్దరు ముఖ్యులను మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది.