పరీక్షతో పెళ్లికి ఆలస్యం..
చొప్పదండి(కరీంనగర్): సరిగ్గా పెళ్లి ముహూర్తానికే పరీక్ష ఉండడంతో ఓ యువతికి పెళ్లా.. పరీక్ష.. అనే సందిగ్ధం నెలకొంది. చివరకు కాబోయే భర్త సాయంతో పరీక్ష రాసి పెళ్లి పీటలు ఎక్కింది. ఈ ఘటన చొప్పదండి మండలం ఆర్నకొండలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన తమ్మడి లింగయ్య, రాజవ్వ దంపతుల కూతురు రమ(21)కు, గొల్లపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన చెన్నాల్ల గణేశ్(25)తో గురువారం వివాహం జరగాల్సి ఉంది.
రమ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. సరిగ్గా పెళ్లి సమయానికే గణితం పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండగా.. వివాహ సమయం ఉదయం పదిన్నరకు ఉంది. కాబోయే భర్త గణేష్ సలహాతో ముందుగా పరీక్షకు హాజరైంది. కరీంనగర్‌లో పరీక్ష రాసి వచ్చి మధ్యాహ్నం పెళ్లి కూతురుగా ముస్తాబైంది. బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు.