
ఊరిస్తున్న మార్కెట్ పదవులు
- చైర్మన్ పీఠం కోసం ఆశావహుల క్యూ
- అధికార పార్టీలో మొదలైన సందడి
- జిల్లాలో 14 వ్యవసాయ మార్కెట్లు
- ఐదింటికి ముగిసిన పదవీ కాలం
- ఈ ఏడాది మరో ఆరు ఖాళీ
నర్సంపేట : జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు అధికార పార్టీ నేతలను ఊరిస్తున్నాయి. నూతన రాష్ట్రం ఆవి ర్భావం... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభం జనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మార్కెట్ చైర్మన్ పీఠంపై దృష్టి సారించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతోపాటు స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో చైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
జిల్లావ్యాప్తంగా 14 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఇందులో చేర్యాల, పరకాల, ఘన్‌పూర్, వర్ధన్నపేట, కొడకండ్ల మార్కెట్ కమిటీల చైర్మన్ పదవి కాలం ముగిసింది. సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లలో వరంగల్ ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పదవి కాలం 2016 ఆగస్ట్ 29 వరకు ఉంది. మరో సెలక్షన్ గ్రేడ్ వ్యవసా య మార్కెట్ అయిన నర్సంపేటకు సంబంధించి కమిటీ చైర్మన్ పదవి కాలం వచ్చే నెల 22తో ముగియనుంది. ఆదాయ పరంగా నర్సంపేట మార్కెట్ జిల్లాలో రెండో స్థా నం ఉండడంతో... ఇక్కడ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెల కొంది.
ఎలాగైనా చైర్మన్ పదవిని దక్కించుకోవాలని అధికార పార్టీకి చెందిన పలువురు పైరవీలు మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలోని నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కా లం ఈ ఏడాది డిసెంబర్ 16న ముగియనుంది. ఈ మేరకు గూడూరు మండలానికి చెందిన ఓ జిల్లా స్థా యి నాయకుడు ఇప్పటికే ప్రయత్నాలు షు రూ చేశారు. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ మాజీ ఎంపీటీసీ సభ్యుడు కూడా చైర్మన్ పదవిపై ధీమాతో ఉన్నారు.
మహబూబాబాద్, ములుగు, జనగామ, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి కా లం కూడా ఈ ఏడాదిలోనే ముగియనుంది. ఆత్మకూర్, తొర్రూరు వ్యవసాయ మార్కెట కు మాత్రం వచ్చే ఏడాది వరకు పదవి కా లం ఉంది.అయినప్పటికీ... టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీఓ తీసుకువచ్చి అన్ని వ్యవసాయ మార్కెట్లకు నూతన చైర్మన్లను ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఆశావహులు చైర్మ న్ పదవుల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.