సంఘటనా స్థలిని పరిశీలిస్తున్న డీఎస్పీ నాగేశ్వర్‌రావు
అర్వపల్లి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ రైతు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు జడ బుచ్చయ్య(65) గ్రామ శివారులోని బోడుపై ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజుల నుంచి నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రివేళలో కాపలా ఉండి పగలు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఆది వారం సూర్యాపేటలో ఫంక్షన్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి కేంద్రం వద్ద నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపారు.
విషయం బయటికి వచ్చిందిలా....
సోమవారం ఉదయం కొమ్మాల గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొని వెళ్లిన సమయంలో బుచ్చయ్య మంచం వద్ద రక్తపు మడుగును చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేయడంతో హత్య విషయం బయటపడింది. మృతుడు బుచ్చయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరి పెళ్లి కాగా వారికి కూడా పిల్లలున్నారు. అయితే సంఘటన విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావు, నాగారం సీఐ తులా శ్రీనివాస్, ఎస్‌ఐ కె. మహేష్ సంఘటన స్థలికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరాతీశారు. జెడ్పీటీసీ సభ్యుడు దావుల వీరప్రసాద్‌యాదవ్, టీఆర్‌ఎస్ నాయకుడు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, కాంగ్రెస్ నాయకులు మోరపాక సత్యం, అనిరెడ్డి రా>జేందర్‌రెడ్డి సంఘటన స్థలికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో ఆధారాల సేకరణ
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్, నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. జాగిలం కాసర్లపహాడ్ గ్రామ శివారు వరకు వెళ్లి వెనక్కి వచ్చింది.
ఎవరిపైనా అనుమానంలేదన్న కుటుంబ సభ్యులు
బుచ్చయ్య హత్యపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని మృతుడి భార్య, ఇద్దరు కుమారులు పోలీసులకు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఎందుకు చేశారో తమకు తెలియదని చెబుతున్నారు.
వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు
బుచ్చయ్య హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బుచ్చయ్య తన భూమిని కుమారులకు పంచారు. అలాగే గ్రామంలోని గంగదేవమ్మ ఆలయానికి కులపెద్ద (చైర్మన్) పదవికి లక్ష రూపాయలు పాటపాడి పదవి దక్కించుకున్నారు. గతంలో వివాహేతర సంబంధం విషయంలో ఒకసారి ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఎంతో కసితో హత్య
బుచ్చయ్యపై ఎంతో కసితో హత్య జరిగినట్లు మృతదేహాన్ని బట్టి చూస్తే అర్ధమవుతుంది. బుచ్చయ్య ముఖంపై గొడ్డలితో ఎక్కడికక్కడ నరికారు. దీంతో ముఖం చిద్రమైంది. అలాగే ఆయన ముఖం, ఒంటిపై 7 గొడ్డలి గాట్లు ఉన్నాయి. ఇంత కసితో ఎందుకు చంపారనేది చర్చనీయాంశమైంది.
ప్రత్యేక బృందం ఏర్పాటు
బుచ్చయ్య హత్యకేసును చేధించడానికి డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శ్రీనివాస్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. శవానికి తుంగతుర్తి ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment