
హైదరాబాద్: యాదవులకు ఇచ్చిన హామీకి కట్టుబడి పదెకరాల స్థలంలో రూ. 10 కోట్లతో యాదవ భవనాన్ని నిర్మించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 29న కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనానికి సీఎం చేయనున్న శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్.. మంత్రి తలసాని సమక్షంలో పదెకరాల స్థలంలో రూ. 10 కోట్లతో యాదవ సంక్షేమ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ హామీని మరచి ఐదెకరాల్లో యాదవులకు, మరో ఐదెకరాల్లో కురుమలకు భవనం నిర్మించేందుకు సమాయత్తం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో యాదవులు 20 శాతం ఉంటే కురుమలు 4 శాతమే ఉన్నారన్నారు. భవనంలో సగం వాటా ఇస్తే, మున్ముందు రాజకీయ రిజర్వేషన్లలోనూ కురుమలు సగం వాటా అడిగే అవకాశం ఉందన్నారు. దీంతో యాదవులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. జాతికోసం పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. విలేకరుల సమావేశంలో సమితి నాయకులు సత్యనారాయణ యాదవ్, కత్తెర రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment