అవి కేసీఆర్ వ్యక్తిగత మొక్కులు: హైకోర్టుకు కంచ ఐలయ్య, రాములు నివేదన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల పలు దేవస్థానాల్లో బంగారు ఆభరణాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంపై ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆ మొక్కులు కేసీఆర్ వ్యక్తిగత మని, కానీ దేవాలయాల కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి చెల్లించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రిటైర్డ్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, సామాజిక కార్యకర్త గుండమాల రాములు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటూ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలు మొక్కులు మొక్కుకున్నారు. అవి తీర్చడంలో భాగంగా కేసీఆర్ ఇటీవల వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుచానూరు అమ్మవారికి ముక్కు పుడక, కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి బంగారు సాలగ్రామ హారం, ఐదు పేటల కంటె సమర్పించిన విషయం తెలిసిందే. ఈ మొక్కులన్నీ కేసీఆర్ వ్యక్తిగతమైనవని.. వాటికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో ఎటువంటి సంబంధమూ లేదని పిటిషనర్లు హైకోర్టుకు విన్నవించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రభుత్వ జీవోలను కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, దేవాదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్లపై చర్యలు చేపట్టాలని, మొక్కుల నిమిత్తం వెచ్చించిన డబ్బును వారి నుంచి రికవరీ చేయాలని కోరారు.
తెలంగాణ మొక్కులపై హైకోర్టులో పిల్
Published Sat, Mar 4 2017 3:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement