సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటీపడి గెలుపొందిన కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. విలువైన ప్లాటు, కారు ఇచ్చి తమ పార్టీకి మద్దతు ఇచ్చే వారిలో ఒకరికి వైస్ చైర్మన్ ఇస్తామని ఎర చూపుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాల్టీలో పార్టీ జెండా ఎగరవేయడానికి పోటీ పడి ఇరు పార్టీలు నజరానాలు ప్రకటిస్తున్నాయి. సదాశివపేట మున్సిపల్ పరిధిలోని 13 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌కి చైర్మన్ పదవి దక్కకుండా ఇండిపెండెంటుకు, కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు ఎర వేసి తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నశివరాజ్ పాటిల్‌కు పదవి దక్కకుండా ఆయన వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కౌన్సిల్ సభ్యడు చీలమల్లన్న సతీమణిని తెరపైకి తెచ్చి జగ్గారెడ్డి అనుచరుడు సుభాష్‌కు చెక్ పెట్టాలని చింతా ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయనే చెప్పవచ్చు. ఇందుకోసం టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం, స్వతంత్రులు, టీడీపీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కి మద్దతు ఇస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇందుకోసం ఒక స్థానంలో గెలిచిన బీజేపీ మద్దతు సైతం తీసుకొని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడికి కోఅప్షన్ సభ్యనిగా నియమించేందుకు హమీ ఇవ్వడంతో పేట మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ పాగా వేసేందుకు అనూహ్యంగా స్వతంత్ర మహిళా అభ్యరిని చైర్‌పర్సన్‌గా నియమించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇందుకోసం 30, 26వ వార్డులల్లో స్వతంత్ర మహిళా అభ్యర్థులను చైర్ పర్సన్లుగా నియమించేందుకు టీఆర్‌ఎస్ ఎంఐఎం మద్దతు కోరింది. ఎంఐఎం గెలిచిన స్థానాల్లో బీసీ కేటగిరిలో మహిళలు లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం సైతం అంగీకరించినట్లు తెలిసింది. 28 వార్డుల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 2 వార్డుల్లో గెలవడం ఆ రెండింటిలో కూడా మహిళా అభ్యర్థి లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిని తెరపైకి తీసుకువచ్చి చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకుండా తనదైన వ్యూహరచనతో చింతా ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పక్షాన గెలిచిన నేతల సైతం గతంలోని తమ స్థానాలను నిలుపుకునేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవడంతో సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయని చెప్పవచ్చు. స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారు ప్రత్యర్థి కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు భారీ నజరానాలు ఎర వేస్తున్నారు.
కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్!
Published Mon, May 19 2014 12:01 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM
Advertisement
Advertisement