తొలి విడతగా ఐదారు వేల కోట్లు
బ్యాంకర్లకు సూత్రప్రాయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్
రుణ మాఫీ అమలుపై మంత్రివర్గ ఉపసంఘం
చైర్మన్‌గా పోచారం, సభ్యులుగా ఈటెల, హరీశ్‌రావు
బ్యాంకులు సహకరించకుంటే రైతులకే బాండ్లు ఇచ్చే యోచన
నాలుగైదు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందన్న మంత్రులు
హైదరాబాద్: రుణమాఫీ కింద రైతులకు విడతలవారీగా నిధులు సర్దుబాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కసరత్తు కూడా అందుకు అనుగుణంగానే జరుగుతోంది. ఈ పథకం అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేం దర్, హరీశ్‌రావు సభ్యులుగా ఉంటారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. రైతులకు పూర్తిస్థాయిలో కొత్త రుణాలు ఇవ్వాలని, అలా చేస్తే బ్యాంకులకు తొలి విడతగా ఐదారు వేల కోట్లను చెలిస్తామని సీఎం స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనల నేపథ్యంలో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేయనట్లు తెలిసింది. దీంతో కేసీఆర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. ప్రజలకు మేలు చేయడానికి తప్ప వ్యతిరేకంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యవహ రించం. ఎన్నికల హామీ మేరకు రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తాం. ఈ విషయంలో బ్యాంకులు అనేక షరతులు పెడుతున్నాయి. దీనిపై రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌తో కూడా మాట్లాడాను. రుణ మాఫీకి సంబంధించి మా దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. రుణ మాఫీ మొత్తాన్ని బ్యాంకులకు విడతలవారీగా చెల్లిస్తాం.
బ్యాంకర్లు రైతులకు తక్షణమే కొత్త రుణాలు ఇవ్వాలి. అందుకు అంగీకరించకుంటే.. రైతులకు బాండ్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఏ పద్ధతిలో రుణమాఫీ అమలు చేయాలన్నది తేలాల్సి ఉంది’ అని సీఎం వ్యాఖ్యానించారు. బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టే కోటీశ్వరులను మాత్రం ఏమీ చేయలేరని, రైతుల రుణామాఫీకి మాత్రం ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణ మాఫీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం కావాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నందున హరీశ్‌రావుతో బుధవారం ఈ సమావేశం జరగనుంది. నాలుగైదు రోజుల్లో ఏ విధానంలో రుణమాఫీ అమలు చేయాలన్న దానిపై విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో నిధు లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో మొదటి విడతగా కొంత మొత్తం నిధులు విడుదల చేస్తామని చెప్పారు. బ్యాంకర్లు తమ ప్రతిపాదనలకు అంగీకరించని పక్షంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, లీడ్ బ్యాంక్ చైర్మ న్ శంతన్‌ముఖర్జీ, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్, ఎస్‌బీఐ సీజీఎం శశికుమార్ పాల్గొన్నారు.