వర్ని(బాన్సువాడ):
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం(ఆర్)లో మంగళవారం జరిగిన మోడల్ స్కూల్ ఐదో వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రం రాక ముందు 240 గురుకులాలు ఉండగా, మూడున్నరేళ్లలో 544 కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి ప్రభుత్వం రూ.లక్ష వెచ్చిస్తోందన్నారు. మోడల్ స్కూల్‌లో చదివి ఆర్మి జవాన్‌గా పని చేస్తున్న జలాల్‌పూర్ శ్రవణ్‌ను మంత్రి అభినందించారు. యాసంగిలో నిజాంసాగర్ ప్రాజెక్టు కింద వేసిన పంటలకు సాగు నీరందిస్తున్నామన్నారు. కొందరు సోల్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 70ఏళ్లలో రైతులకు నిర్లక్ష్యం చేసిన నాయకులకు 24 గంటల కరెంట్ సరాఫరా చేస్తే కడుపు మండుతుందని దుయ్య బట్టారు. బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంత్, డీఈవో రాజేష్, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, వర్ని, కోటగిరి ఎంపీపీలు చింగ్లీబాయి, సులోచన, ఏఎంసీ చైర్మన్ గంగారాం, తహసీల్దార్లు హరిబాబు, రాజు, ఎంపీడీవో వేణు గోపాల్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అలూరి నరేందర్ ఉన్నారు.
ఎస్‌ఎంసీ సభ్యుల
గైర్హాజరుతో అసంతృప్తి
మండల కేంద్రంలో జరిగిన వర్ని, కోటగిరి, రుద్రూర్ మండలాల ఎస్‌ఎంసీల సమావేశానికి సభ్యులు తక్కువగా రావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడికే రాకుంటే పాఠశాలకు ఇంకెలా వెళతారు, అసలు వస్తారా..? అనే సందేహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతగా పని చేయాలన్నారు. పెత్తనం చెలాయించేందుకు కమిటీలు కాదని, ప్రభుత్వం పాఠశాలలకు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగించి సమస్యలు పరిష్కరించడం కోసమన్నారు.
సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వండి..
జిల్లాలో నెలకొన్న పాఠశాలల సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. కొన్ని పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థినులు మంచి నీరు తాగడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇలాగైతే వారి కిడ్నిలు చెడిపోయి అనార్యోగం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నివేదికను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి మౌలిక సదుపాయాల కల్పనకు చర్చిస్తానని మంత్రి అన్నారు. సమావేశంలో సర్వశిక్షఅభియాన్ సీఎంవో స్వర్ణలత, ఎంఈవోలు శాంతకుమారి, నరేష్ కుమార్, వైస్ చైర్మన్ మేక వీర్రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment