
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) విధించిన పరిమితికి మించిన ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మండిపడింది. 2012–17 మధ్య స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ఏకంగా రూ.5,820.90 కోట్లు అధిక వ్యయం జరిగిందని తేల్చింది. జల విద్యుత్ కొరత, విద్యుదుత్పత్తి ప్లాంట్ల ప్రారంభంలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌లో పెరుగుదల కారణంగా అధిక ధరతో విద్యుత్ కొనాల్సి వచ్చిందని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఎస్పీడీసీఎల్ పనితీరుపై కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలివీ..
- కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఫైవ్‌స్టార్ రేటింగ్ కలిగిన త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయాలి. కానీ టీఎస్‌ఎస్పీడీసీఎల్ త్రీస్టార్ రేటింగ్ గల ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అధిక నాణ్యత గల ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తే.. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా 701 నుంచి 20,586 యూనిట్ల వరకు విద్యుత్ పొదుపు జరిగేది. దీంతో 25 ఏళ్లలో రూ.2,220.49 కోట్లు ఆదా అయ్యేవి.
- 2012–17 మధ్య వ్యవసాయ విద్యుత్ సరఫరా అనుమతించిన పరిమితులను మించిపోవడంతో సంస్థపై రూ.1,744.56 కోట్ల భారం పడింది. 2012–17 మధ్య విద్యుత్ నష్టాల విలువ రూ.1,306.76 కోట్లు ఉంటుంది. 2016–17 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సకాలంలో ఈఆర్సీకి సమర్పించకుండా.. పాత టారిఫ్‌ను కొనసాగించడం వల్ల సంస్థకు రూ.323.89 కోట్ల నష్టం జరిగింది.
- మౌలిక సదుపాయాల వృద్ధి కోసం 2012–17 మధ్య ఈఆర్సీ ఆమోదించిన వ్యయం రూ.5,843.43 కోట్లు. కానీ సంస్థ రూ.6,632.62 కోట్లు ఖర్చు చేసింది. ఈ అధిక వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించకపోవడంతో.. రూ.789.19 కోట్లను భరించాల్సి వచ్చింది. హా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం సంస్థ ముందుగానే నిధులు సమీకరించుకోలేదు. దాంతో రూ.585.91 కోట్లను సొంత వనరుల నుంచి ఖర్చు చేసింది. హా 2012–14 మధ్య చేపట్టిన వివిధ పనుల కోసం తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలో 3 నుంచి 5 శాతం వరకు రాయితీని జాతీయ విద్యుత్ నిధి (వడ్డీ రాయితీ) పథకం సమకూర్చింది. ఈ పథకం కింద 2013–17 మధ్య రూ.216.91 కోట్లు రాబట్టుకునేందుకు అవకాశమున్నా.. సంస్థ కేవలం 2013–14కి సంబంధించిన రూ.4.01 కోట్ల రాయితీని మాత్రమే రాబట్టుకుంది.
- డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఈఆర్సీ నుంచి ఆమోదం పొందలేదు. దీంతో ఆ పథకం కింద రీషెడ్యూల్ చేసిన రుణాలకు సంబంధించిన వడ్డీలను 2015–16లో విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించలేదు. దీనివల్ల సంస్థ రూ.1400.74 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment