హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల అమలులో ఉన్న లోపాలను కాగ్ ఎత్తిచూపింది. సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైన్లు సమర్పించడం, వాటిని ఆమోదించడంలోనూ, పునరావాస కార్యక్రమాలు, అటవీ అనుమతులు పొందడంలో జాప్యం వల్ల ప్రాజెక్టులు పూర్తికాలేదని కాగ్ స్పష్టం చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేసిన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల అమలు విషయంలో కాగ్ ఆడిట్‌లో వెల్లడైన ముఖ్యమైన విషయాలు..
► రెండు సంవత్సరాలలో మొత్తం ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయడం లక్ష్యంగా కాగా, కొన్ని అనుబంధ పనులు మినహాయించి రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయని కాగ్ తెలిపింది. దీంతో.. 52000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యానికి గాను కేవలం 13900 ఎకరాలకు మాత్రమే సాగునీటి సామర్థ్యం కల్పించారని కాగ్ వెల్లడించింది.
► అన్ని ప్రాజెక్టుల్లో ప్రతిసంత్సరం వ్యయంలో మిగుళ్లు(రూ. 319.02 కోట్లు) ఉన్నాయని కాగ్ తెలిపింది.
► సత్వర సాగునీటి ప్రయోజనం కింద చేపట్టిన గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ వద్ద పెద్దవాగులకు సంబంధించి మొత్తం గ్రాంటును అందుకున్నప్పటికీ 11 సంవత్సరాల తరువాత కూడా ఇంకా పూర్తికావలసి ఉన్నాయని కాగ్ తెలిపింది.
► వర్షపాతం- వర్షనీటి ప్రవాహాల మధ్య నిష్పత్తిని వర్తింపచేయడంలోనూ, వరద ప్రవాహాలను సమీక్షించడంలోనూ కేంద్ర జల సంఘం చేసిన సిఫారసులను పాటించలేదని కాగ్ తెలిపింది. దీంతో ప్రాజెక్టుల్లో విశ్వసనీయమైన నీటి లభ్యతను లెక్కించడంలో శాస్త్రీయతను ఆడిట్ పరీక్షించలేకపోయిందంది.
► ప్రతి గ్రామంలో కల్పించే సాగునీటి సమార్ధ్యాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నియమావళి నిర్దేశించిన విధంగా ప్రాజెక్టుల సమగ్ర నివేదికలో పొందు పరచలేదని కాగ్ తెలిపింది.
► మత్తడివాగు, జగన్నాథ్‌పూర్ వద్ద పెద్దవాగు ప్రాజెక్టుల్లో సంబంధిత కాలువలు లేకుండానే హెడ్ రెగ్యులేటర్లు ప్రణాళికలో చేర్చి నిర్మించారని కాగ్ స్పష్టం చేసింది.
► గుత్తేదారు సంస్థలచే సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్‌లోనూ(ఎస్ అండ్ ఐ), అటవీ భూముల కొరకు ప్రతిపాదనలు సమర్పించడంలోనూ జాప్యాలున్నాయని తెలిపింది. అలాగే ఆశించిన విధంగా ఎస్ అండ్ ఐ నివేదికను గుత్తేదారు సమర్పించలేదని తెలిపింది.
► డిజైన్లను సమర్పించడంలో, ఆమోదించడంలో జాప్యాలున్నాయని, సకాలంలో డిజైన్లు ఖరారు చేయడంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదని కాగ్ తెలిపింది.
► ఒప్పందాలను నిర్దేశించిన విధంగా సంస్థలు అంచనాలను తయారు చేయలేదని కాగ్ తెలిపింది. ఎటువంటి కారణాలు లేకుండానే చెల్లింపుల షెడ్యూళ్లను చాలాసార్లు సవరించారంది.
► ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు పునరావాస, పునర్నిర్మాణ సదుపాయాలు అందకపోవడం, ఆలస్యంగా అందిన సందర్భాలున్నాయని, ఫలితంగా ప్రాజెక్టుల అమలులో జాప్యమైందని తెలిపింది.
► ఒప్పంద వ్యయంలో తగినటువంటి మార్పు చేయకుండానే ప్రాజెక్టు ప్రాథమిక పరిమితులలో మార్పులను అంగీకరించిన సందర్భాలున్నాయని.. ఇది గుత్తేదారు సంస్థలకు ఆయాచిత లబ్దికి దారితీసిందని కాగ్ తెలిపింది.
కాగ్ రిపోర్ట్: లోపాలమయంగా తెలంగాణ ప్రాజెక్టులు!
Published Mon, Mar 27 2017 12:40 PM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement