కాయ్ రాజా కాయ్.. | Cai Raja Cai .. | Sakshi
Sakshi News home page

కాయ్ రాజా కాయ్..

Published Wed, Jan 21 2015 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

కాయ్ రాజా కాయ్..

కాయ్ రాజా కాయ్..

మనుషులు మానసికంగా బలహీనమవుతారు...  కుటుంబాలు ఛిద్రమవుతాయి... సంపాదనంతా దాని పాలే అవుతుంది..  అయినా తృప్తి ఉండదు.. మనసు అటే లాగుతుంది. ఎవరికివారు తనలో తానే మాట్లాడుకుంటారు... వేళ్లపై లెక్కలు వేసుకుంటారు.. తగిలిందా సంతోషం..లేకపోతే విషాదమే... ఇదంతా మట్కా మమమ్మారి మాయ.. కోట్లలో సాగుతున్న దందాతో నిర్వాహకులు శ్రీమంతులవుతుంటే, జూద మాడేవారు మాత్రం బికారులవుతున్నారు. ఇంత జరుగుతున్నా మన పోలీసులు మాత్రం మౌన మునులను మరిపిస్తున్నారు. దీని భావమేమి తిరుమలేశా!!
 
ఏటా రూ.100 కోట్లకు పైగా మట్కా దందా
బీటర్లకు రాజకీయ నేతల అండదండలు
నిజామాబాద్ కేంద్రంగా భారీ లావాదేవీలు
రోజు రోజుకూ వీధిన పడుతున్న కుటుంబాలు
గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యాపారం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘వన్ అప్ టూ డౌన్... నైన్ క్లోజ్... టూ బ్రాకెట్... ఇలా వచ్చాడు. ఇక్కడ మనం దారితప్పాం’’ ఇవి మట్కా మాయలో పడి డబ్బులు తగలేసుకుంటున్న సగటు జీవి నిత్యం వల్లె వేసే మాటలు. దినసరి కూలీ మొదలు కొందరు ఉద్యోగులకు వరకు మట్కాను వ్యసనంగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు పోగొట్టుకోవడమే తప్ప సంపాదించిన దాఖలాలు లేవు.కొంతకాలం కఠినంగా వ్యవహరించిన పోలీసులు ఇటీవలి కాలంలో మట్కా వ్యాపారులను చూసీ చూడనట్లుగా వదిలేస్తుండటంతో, అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయి.

నిజామాబాద్-మహారాష్ట్ర సరి హద్దు నిజామాబాద్, బోధన్, రెంజల్, ఎడపల్లి, నవీపేటతో పాటు బాన్సువాడ, వర్ని, కోటగిరి, ఆర్మూరు, పె ర్కిట్, పోచంపాడ్, బిచ్కుంద తదితర ప్రాంతాలలో మట్కా జడలు విప్పి ఆడుతోంది. పట్టణాలను, గ్రామాలను అల్లకల్లోలం చేస్తోంది. నిజామాబాద్ నగ రంలో వీధి వీధికి విస్తరించిన ఈ జూదం కుటుంబాలనే చిదిమేస్తోంది. పోలీసులు మొదట దాడులు బాగానే జరిపినా,పూర్తి స్థాయిలో నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్వాహకుల నుంచి కొందరికి పెద్ద ఎత్తున అందుతున్న నెలవారీ మామూళ్లే ఇందుకు కారణమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
 
సరిహద్దులో విచ్చలవిడిగా
ముఖ్యంగా సరిహద్దు గ్రామాలలో మట్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అందులో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మట్కా వైపు యువత ఆకర్షణకు దోహదపడుతోంది. జిల్లాలో ఏడాదికి రూ.100 కోట్లకు పైగా జూదం కొనసాగుతున్నా పోలీసులు ప్రేక్షకులుగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. ముంబాయి ప్రధాన కేంద్రంగా, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలు కళ్యాణి, బాంబే మట్కా కంపెనీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.

ధర్మాబాద్, బిలోలి, నర్సి,నయా గామ్, పూసల్, అకోలా ప్రాంతాలకు చెందిన వ్యాపారుల దందా పోలీసులలో కలవరం కలిగిస్తోంది. జిల్లాలో నెలకు రూ. ఎనిమిది కోట్ల నుంచి రూ. పది కోట్ల మట్కా జూదం కొనసాగుతుంది. రూపాయికి తొమ్మిది రూపాయలతో నడిచే సింగిల్ డిజిట్ నంబర్, ఓపెన్, క్లోజింగ్ నంబర్లపై జూదం నడుస్తోంది.ఓపెన్, క్లోజింగ్ నంబర్లతో బ్రాకెట్ నంబర్‌కి వందరెట్ల చెల్లింపులని చెబుతారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఇందులో పాత్రధారులే. ప్రభుత్వ ఉ ద్యోగులు జీతం డబ్బులు పెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. దశాబ్ధ కాలంగా సెల్యూలర్ ఫోన్‌ల వినియోగం పెరగడంతో యువకులు అధిక సంఖ్యలో మట్కాకు ఆకర్షితులవుతున్నారు.
 
ఇప్పుడా భయం లేదు
మట్కా అడ్డాలకు వెళ్లాలంటే యువకులు భయపడేవారు. ఇప్పుడా భయం లేదు. ఎందుకంటే సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడవుతున్నాయి. సెల్‌ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు, కళ్యాణి మట్కా మధ్యాహ్నం రెండు గంటలకు ఓపెనింగ్, నాలుగు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది. అదే విధంగా బాంబే మట్కా కంపెనీ ఓ పెనింగ్ తొమ్మిది గంటలకు, రాత్రి పన్నెండు గంటలకు క్లోజింగ్ నంబర్లను ప్రకటిస్తుంది.

అర్ధరాత్రి సమయానికి వచ్చిన నంబర్లు తెలిసే సరికి ఆలస్యం కారణంగా జూదరులకు మాత్రమే మట్కా పరిమితమయ్యేది. ఆధునిక కాలంలో సమాచార వేగం వృద్ధి చెందడం, సింగిల్ డిజిట్ నంబర్ల లాటరీలపై నిషేధం ఉండడంతో ఈ మట్కా జూదంలో జూదరులతోపాటు యువకులు డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది.
 
సామాన్యులే పావులు
నిజామాబాద్‌లో రైల్వేస్టేషన్, మిర్చికాంపౌండ్, కోటగల్లి, మైసమ్మగడ్డ, కసాబ్‌గల్లీ, బోధన్‌లో హెడ్ పోస్టాఫీసు, రెంజల్‌లో బేస్ ఏరియా, ఎడపల్లి, జానకంపేట, నెహ్రునగర్ ప్రాంతాలు ‘బుకీ’లకు అడ్డాలుగా ఉన్నాయి. బాన్సువాడ, వర్ని, కోటగిరి ప్రాంతాలలో ఎక్కువగా దినసరి కూలీలు, సామాన్యులు మట్కాకు ఆకర్షితులు కాగా, దెగ్లూరు నుంచి ‘బుకీ’లు, ఏజెంట్లు వచ్చి లావాదేవీలు జరుపుతున్నారు.

ఐదేళ్ల క్రితం ఆర్మూరు, పెర్కిట్, పోచంపాడ్‌లో విచ్చలవిడిగా సాగి, తగ్గిన మట్కా మహమ్మారి మళ్లీ పురుడు పోసుకుంది. కామారెడ్డి ప్రాంతానికి చెందిన పలువురు ఇతర ప్రాంతాలకు ‘కాయ్ రాజా కాయ్’ అంటూ బుకీలను ఆశ్రయిస్తున్నారు. కాగా, ఈ సరిహద్దులో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని అంతర్రాష్ట్ర పోలీసు నిఘాతోనైనా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement