లెక్కా పత్రం లేదు | Calculations do not document | Sakshi
Sakshi News home page

లెక్కా పత్రం లేదు

Published Tue, Aug 5 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

లెక్కా పత్రం లేదు

లెక్కా పత్రం లేదు

  •    మొక్కుబడిగా సమీక్ష
  •    వివరాలివ్వని జీహెచ్‌ఎంసీ అధికారులు
  •    సమీక్ష సోమవారానికి వాయిదా
  • సాక్షి, సిటీబ్యూరో: పేరుకే అది సమీక్ష. ఏ పనులపై సమీక్ష అని ప్రకటించారో ఆ పనులకు సంబంధించి సరైన సమాచారం లేదు. వాటిల్లో ఎన్ని పూర్తయ్యాయో.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో .. పనులు ఏ దశలో ఉన్నాయో వివరాలు లేవు.. జీహెచ్‌ఎంసీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష తీరూ..తెన్నూ.
     
    జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులకు సంబంధించి రెండేళ్లుగా పాలకమండలి, స్టాడింగ్ కమిటీ చేసిన తీర్మానాలపై సోమవారం మేయర్ మాజిద్ హుస్సేన్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. సమీక్షలో అధికారులు మొక్కుబడిగా వివరాలను అందించారు.  

    రెండేళ్లుగా ఎన్ని తీర్మానాలు చేశారు. వాటిల్లో  ఎన్ని పూర్తయ్యాయి..అవి ఏ దశల్లో ఉన్నాయో  సమాచారం లేదు.  కనీసం ఇచ్చిన అంశాలు.. పనులైనా వరుసక్రమంలో ఉన్నాయా అంటే అదీ లేదు. ఇంజినీరింగ్ విభాగం నుంచి అందిన కొన్ని పనుల చిట్టాను తీసుకొచ్చి వాటినే  సభ్యులకు అందజేశారు. సమావేశంలో ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లు దిడ్డిరాంబాబు(కాంగ్రెస్), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ) ,  నజీరుద్దీన్(ఎంఐఎం), స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

    హడావుడిగా ఇచ్చిన కాగితాల్లోని అంశాలను చూడటానికే వారికి సమయం సరిపోలేదు. కనీసం ఒకరోజు ముందుగా వివరాలందజేస్తే.. వాటిని పరిశీలించేందుకు వీలుండేదని ఫ్లోర్‌లీడర్లు వాపోయారు. సమీక్ష అంశాన్ని పక్కనబె ట్టి కార్పొరేటర్లకు నిధులు పెంచాలని, జోనల్‌స్థాయిలో మంజూరును రూ. 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. పనులను పెద్ద ప్రాజెక్టులుగా చేపట్టాలని.. కనీసం రూ. ఒక్కో ప్రాజెక్టు విలువరూ. 50 కోట్లకు తగ్గకుండా ఉండాలనే కమిషనర్ సోమేశ్‌కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

    ఒక్కో కార్పొరేటర్‌కు 5వేల మొక్కలు పంపిణీ చేయాలని  డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల పనుల్ని అధికారులు  పట్టించుకోవడం లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు సమీక్షించాల్సిన అంశాల్ని విస్మరించారు. కార్పొరేటర్ల  బడ్జెట్ నిధుల విడుదలలో  ఏయే పనులకు ఎంతమేర నిధులో మార్గదర్శకాలు అవసరం లేదని, కార్పొరేటర్లు ఏ పనులు కావాలంటే అవి చేపట్టాలని పట్టుబట్టారు. తమ బడ్జెట్ నిధుల వినియోగంలో తమకే పూర్తిస్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు.  డంపర్‌బిన్లు, చెత్త రిక్షాలు తగినన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

    పనుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు సీఈ, ఎస్‌ఈలనే జోన్లకు పంపించాలని కోరారు. పనులకు సంబంధించి సరైన నివేదిక లేకపోవడం.. ఆయా డిమాండ్లపై గందరగోళం.. నేపథ్యంలో తీర్మానాల అమలు సమీక్షను మేయర్ వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. అధికారులు పూర్తి చేశామని చెబుతున్న పనులకు సంబంధించి నమూనాగా కొన్నింటిని తనిఖీ చేద్దామన్న మేయర్ సవాల్‌కు అధికారుల నుంచి మౌనమే సమాధానమైనట్లు తెలిసింది.  
     
    అన్ని ప్రాంతాల్లో లిట్టర్ ఫ్రీ ..
     
    స్టాండింగ్ కమిటీకి తెలియకుండా లిట్టర్‌ఫ్రీని ప్రారంభించారని అధికారులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిట్టర్‌ఫ్రీ విధానాన్ని  అన్ని జోన్లలో ప్రవేశపెట్టాలని, కేవలం 23 కి.మీ.లలో కాకుండా దాదాపు 300 కి.మీ.ల మేర చేపట్టాలని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు కోరారు. వారం రోజుల్లోగా ఈ పనులు చేపట్టాలనడం కోరారు. గ్రేటర్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. సమగ్ర రహదారుల అభివృద్ధిపనులు త్వరితగతిన పూర్తయ్యేందుకు కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.  రూ. 5 కోట్లకు పైబడిన పనులు చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని మేయర్ ప్రస్తావించగా, వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్, స్పెషల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement