
కొండలా నిధులు..కదలని పనులు
- ముందుకు కదలని ప్రాజెక్టులు
- సదుపాయాలకు నోచని శివారు జనం
- ప్రాజెక్టులదీ అదే దారి..
- మూలుగుతున్న రూ.4వేల కోట్లు
- ఇదీ ‘గ్రేటర్’ కార్పొరేషన్ తీరు !
ఎక్కడైనా అభివృద్ధి కనిపించలేదంటే నిధులు లేవ నే నిట్టూర్పులు వినిపిస్తాయి. గ్రేటర్‌లో పరిస్థితి భిన్నం. జీహెచ్‌ఎంసీలో రూ.వేల కోట్లు నిధులుంటాయ్... ప్రాజెక్టులు కదలనంటాయ్. కార ణమేంటంటే... కార్యశీలురేరీ అని ప్రశ్నిస్తాయి. మనం వెదుక్కునే లోపే కాలంతో పాటే కాసులూ వెనక్కి వెళ్లిపోతాయ్. కావాలంటే జీహెచ్‌హెంసీలో మూల్గుగుతున్న రూ.నాలుగు వేల కోట్ల నిధులను అడగండి. నిజమేంటో చెబుతాయ్.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అటు కార్పొరేటర్లకు మంజూరు చేసిన అభివృద్ధి నిధులు...ఇటు వివిధ పథకాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఖర్చు చేయడం లేదు. ఈ విషయంలో కార్పొరేటర్లు, అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరే అవలంబిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. గ్రేటర్ శివారుప్రాంతాల్లోని 50 మంది కార్పొరేటర్లకు రూ. 2 కోట్లు వంతున, కోర్ ఏరియాలోని 100 మంది కార్పొరేటర్లకు రూ. 1.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 250 కోట్లు కేటాయించారు.
గత ఆర్థికసంవత్సరం వీరి ఖాతాలోనివే ఖర్చు కానివి మరో రూ. 35 కోట్లున్నాయి. వెరసి మొత్తం 285 కోట్ల కార్పొరేటర్ల నిధులున్నాయి. వీటిల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరుమాసాల్లో పనులకు రూ. 175 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 2,220 పనులు చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరులోగా వాటిని పూర్తి చేయాలి. కానీ వీటిల్లో కేవలం రూ. 7 కోట్ల విలువైన 190 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 తో ముగిసిపోనుంది.
ఈలోగా కార్పొరేటర్లు ఎన్ని పనులు పూర్తి చేయగలరో.. ఇంకెన్ని కోట్లు వారి బడ్జెట్ నిధులు మిగిలిపోనున్నాయో తెలి యని పరిస్థితి నెలకొంది. ఇది కార్పొరేటర్ల నిధులకు సంబంధించిన వ్యవహా రం కాగా జీహెచ్‌ఎంసీ బడ్జెట్ నిధుల తీరూ ఇలాగే ఉంది. ఏటికేడు బడ్జెట్ నిధులు భారీగా చూపుతున్నప్పటికీ, పనులు మాత్రం జరగడం లేవు. నిధులు మాత్రం గుట్టలుగా ఉన్నప్పటికీ.. పనులు చేయించే సత్తా అటు కార్పొరేటర్లకు, ఇటు అధికారులకు లేకపోవడంతో నిధులు మూలుగుతున్నాయి.
మచ్చుకు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా...వీటిల్లో ఒక్క శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లుగా మంజూరైన నిధులు.. పనులు, వాటిల్లో పూర్తయిన పనులు.. మిగిలిపోయిన నిధులను ఓ మారు పరిశీలిస్తే ‘గ్రేటర్’ గొప్పతనం తేటతెల్లమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం శేరిలింగంపల్లికి రూ. 2.43 కోట్లు మంజూరు కాగా, గత ఆగస్టు మొదటి వారం వరకు దాదాపు రూ. 1.17 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా జీహెచ్‌ఎంసీ ఏర్పాటైనప్పటినుంచి దాదాపు ఐదే ళ్లలో ఈనియోజకవర్గానికి మంజూరు చేసిన నిధుల్లో ఇంకా రూ. 216 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. దీనిని పరిగణనలోకి తీసుకొని అంచనా వేసినా... గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాలకు వెరసి దాదాపు రూ. 4000 కోట్ల విలువైన పనులు జరగలేదు.
శివార్లలో సమస్యలతో సహవాసం.. గ్రేటర్‌లోని కోర్ ఏరియా (పాత ఎంసీహెచ్) పరిధిలో రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాల వంటి కనీస సదుపాయలున్నప్పటికీ, గ్రేటర్ ఏర్పాటుతో విలీనమైన శివారు మునిసిపాలిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్ ఏరియా వారితో సమానంగా తాము సైతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నా తమకెందుకు సదుపాయాలు కల్పించరని శివార్లలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారులతో పాటుమారుతున్న ప్రాధాన్యాలు
శివారు ప్రాంత ప్రజల సమస్యలు తీర్చేందుకు ఒకప్పటి కమిషనర్ సమీర్‌శర్మ తగు ప్రణాళిక రూపొందించారు. సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పన(టిప్) పథకం కింద వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు దాదాపు రూ. 925 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. తీరా పనులకు టెండర్లు పిలవాల్సిన సమయంలో ఆయన బదిలీ కావడంతో ఆయన స్థానంలో కమిషనర్‌గా వచ్చిన కృష్ణబాబు టిప్‌ను అటకెక్కించారు. ప్రస్తుత కమిషనర్ సోమేశ్‌కుమార్ రూ. 5కే భోజనం, బస్తీలకు శుద్ధజలం, పబ్లిక్ స్థలాల్లో టాయ్‌లెట్ల వంటి సంక్షేమ కార్యక్రమాలపై శ్రద్ధ చూపుతున్నట్లుగానే...మౌలిక సదుపాయాలపై కూడా చూపాలని ప్రజలు కోరుతున్నారు.
కొసమెరుపు: బహుశా గ్రేటర్‌లోని అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల భారీ పనులు కావడం లేదని గ్రహించి ప్రస్తుత కమిషనర్ సోమేశ్‌కుమార్ పనులను చిన్నమొత్తాల్లో కాకుండా కనీసం రూ. 100 - రూ. 150 కోట్లకు తగ్గకుండా పైస్థాయి కాంట్రాక్టర్లను పిలవాలని నిర్ణయించారు. తద్వారా జాతీయస్థాయి కాంట్రాక్టర్లు సైతం టెండర్లకు ముందుకొచ్చి పనులు చేయగలరని భావిస్తున్నారు. ఈ ఆలోచనను అమలులోకి తేవడం వల్లయినా పనులు జరుగుతాయో లేదో వేచి చూడాలి.