ఇంటర్వ్యూ రోజే కాల్‌లెటర్
- పోస్టాఫీస్ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగికి శాపం
కరీంనగర్: పోస్టల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిరుద్యోగికి శాపమైంది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన చుక్క తిరుపతి కోర్టులో అటెండర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హైదరాబాద్‌లో ఈ నెల 22న జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈ నెల 14న కాల్‌లెటర్‌ను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. కాల్‌లెటర్ ఈ నెల 16న హుస్నాబాద్ పోస్టాఫీస్‌కు వచ్చింది. పోస్టుమ్యాన్ లీవ్‌లో ఉండగా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. అప్పటికి తిరుపతి పలుమార్లు కాల్‌లెటర్ కోసం పోస్టాఫీస్‌లో వాకబు చేసినా రాలేదనే సమాధానం చెప్పారు.
తిరిగి విధులకు చేరిన పోస్ట్‌మెన్ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కాల్‌లెటర్ తిరుపతికి అందించాడు. తిరుపతి దాన్ని తెరిచి ఆతృతగా చూడగా 22న ఇంటర్వ్యూకు రావాలని ఉండగా, ఇదే రోజు కాల్‌లెటర్ అందడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. కాల్‌లెటర్ వచ్చి ఆరు రోజులు గడిచినా సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఎస్పీఎం సంపత్‌ను నిలదీశాడు. పోస్ట్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.