పీపీఏల రద్దు చట్టవిరుద్ధం: టీ కాంగ్రెస్ మండిపాటు
హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమని టీ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె. జానారెడ్డిలు పేర్కొన్నారు. విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. చట్టాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఏముందని జానారెడ్డి మండిపడ్డారు.
ఈ విషయంలో తాము ఈఆర్‌సీకి, కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. విభజన బిల్లుకు భిన్నంగా పీపీఏలను ఉపసంహరించడం కవ్వింపు చర్యగా పొన్నాల అభివర్ణించారు. ఈ ఉపసంహరణ ప్రతిపాలను విరమించుకునేలా చంద్రబాబుపై తెలంగాణ టీడీపీ నాయకులు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఇరాక్‌లో వెయ్యి మంది తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వీరిని ఆదుకునేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలని పొన్నాల సూచించారు.