బాబువి అనైతిక చర్యలు: మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్: విద్యుత్ పీపీఏలను రద్దుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, అదే దారిలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్‌లో ఏపీ సర్కారు పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి టి.హరీష్‌రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం తర్వాత సచివాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
పీపీఏలు కొనసాగుతాయంటూ విభజన చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు ఉమ్మడిగా కొనసాగుతాయని చట్టంలో స్పష్టంగా పొందుపర్చిన అంశాలను అతిక్రమించడం ద్వారా బాబు అనైతిక చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందవద్దని సూచించారు. పీపీఏలను రద్దుచేస్తూ ఆంధ్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుకానివ్వబోమని స్పష్టంచేశారు