సాక్షి, హైదరాబాద్ : ఛాతిలో, కడుపులో మంట ఇలా ఏదైనా సమస్య వస్తే వైద్యులకు చెప్పకుండానే అనేక మంది ‘రానిటిడిన్’ మందు లను వాడేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్ తోనూ, ప్రిస్కిప్షన్ లేకుండానే ఈ మం దును ఔషధ దుకాణాల్లో ఇస్తున్నారు. కానీ రానిటిడిన్‌లో ప్రమాదకరమైన ఎన్– నైట్రొసో డైమిథైలమైన్ (ఎన్‌డీఎంఏ) కొద్ది మోతాదులో ఉందని, దీంతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) తాజాగా ప్రకటించింది. దీంతో కెనడా, సింగపూర్, ఈజిప్ట్, బహ్రెయిన్ సహా పలుదేశాలు ఈ మందును నిషేధించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ఈ ఔషధంతో కూడిన మాత్రలను తయారు చేస్తాయి. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఇప్పటికే కొన్ని దేశాలకు ఎగుమతి చేయగా.. ఎఫ్‌ఏడీ ప్రకటనతో ఆ సరుకును వెనక్కి తెప్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలోనూ ఈ ఔషధంతో కూడిన మాత్రలను నిషేధించాలని ఫార్మసిస్టులు కోరుతున్నారు.
దేనికి వాడుతున్నారంటే..
రానిటిడిన్‌తో దేశంలో అనేక అంతర్జాతీయ బహుళ ఫార్మా కంపెనీలు రెండు మూడు ప్రధాన మైన బ్రాండ్ల పేరుతో ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. రానిటిడిన్–150 ఎంజీ మాత్ర హిస్టమైన్–2 బ్లాకర్ అని పిలిచే ఒక ఔషధ సమూహాన్ని కలిగి ఉంది. ఈ ఔషధం కడుపులో ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కడుపు, పేగు లోపల పూతలా చికిత్స అందిస్తుంది. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి, జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు కడుపులో అధిక ఆమ్ల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అలాగే డియోడినల్ అల్సర్‌లు వచ్చినప్పుడు రానిటిడిన్–150 ఎంజీ మాత్ర ఉపయోగిస్తారు. చిన్న పేగు పూతల స్వల్పకాలిక చికిత్స కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతలకు స్వల్పకాలిక చికిత్స కోసం రానిటిడిన్–150 ఎంజీ వాడుతారు. పూతల బారిన పడిన తర్వాత నిర్వహణ చికిత్సగా ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి నివారణకు కూడా రానిటిడిన్–150 ఎంజీని వాడతారు. ఎరోసివ్ ఈసోఫాగిటిస్ వచ్చినప్పుడు కూడా ఈ మాత్ర వాడతారు. కడుపు నుంచి సుదీర్ఘ ఆమ్లం రిఫ్లక్స్ కారణంగా ఆహార గొట్టం క్షీణిస్తే చికిత్స చేసేందుకు ఈ మాత్ర ఉపయోగిస్తారు. అలాగే జోలింగర్–ఎల్లిసన్ సిండ్రోమ్ వచ్చినప్పుడు కడుపులో ఆమ్ల స్రావం అరుదుగా ఉన్న అరుదైన పరిస్థితుల లక్షణాల ఉపశమనానికి ఈ మాత్రను ఉపయోగిస్తారు. హైపర్ సీక్రెటరీ కండీషన్‌లో చికిత్సకు ఉపయోగిస్తారు.
భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు..
కడుపులో మంట, ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి పరిస్థితులను అనేకమంది ఎదుర్కొంటున్నారు. దీన్ని నివారించడానికి రానిటిడిన్ మూలనామం కలిగిన అనేక బ్రాండ్లతో కంపెనీలు తయారు చేస్తున్నాయి. అవన్నీ కూడా ప్రజలకు సుపరిచితం. భారత్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు వీటిని ఉపయోగిస్తున్నారని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు సంజయ్‌రెడ్డి తెలిపారు. భారత్‌లో ఈ మందును నిషేధించాలని కోరారు.
రానిటిడిన్ ఔషధంలో కేన్సర్ కారకాలు
Published Tue, Sep 24 2019 3:16 AM | Last Updated on Tue, Sep 24 2019 3:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment