కేన్సర్‌తో కువైట్‌లో బాధపడుతున్న మనోహర్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో కువైట్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసిని వెనక్కి రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైంది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, నిమ్మపల్లికి చెందిన మనోహర్ కూలిపని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ అతను ఓ కేసులో నిందితుడయ్యాడు. అయితే, అతడికి కేన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కువైట్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ, బాధితుడిని స్వరాష్ట్రానికి రప్పించాలని కుటుంబ సభ్యులు మంత్రి కె.తారకరామారావును కలిశారు. కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నారై శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మనోహర్‌ను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాగా, కువైట్‌లో మనోహర్‌పై పెండింగ్‌లో ఉన్న ఓ కేసుకు సంబంధించి రూ.19 లక్షల జరిమానా చెల్లిస్తేనే స్వదేశానికి పంపిస్తామని కువైట్ ప్రభుత్వం తెలిపింది. దానికి, అక్కడి ఎన్జీవోలంతా కలసి జరిమానా చెల్లించి, మనోహర్‌కు ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మనోహర్‌ను బుధవారం స్వదేశానికి తీసుకువస్తున్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బాధితుడికి చికిత్సకు నిమ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేయలాని మంత్రి కేటీఆర్ అదేశించారు. ప్రవాస భారతీయులు ఏ కష్టంలో ఉన్నా తెలంగాణ ఎన్నారై శాఖ 040–23220603 నంబరుకు ఫోన్ చేయాలని, లేదా so_nri@ telangana. gov. in కు మెయిల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.