సూర్యాపేటలో ఇంటింటి ప్రచారం చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, నాగారంలో ప్రచారం నిర్వహిస్తున్న కడియం రామచంద్రయ్య సతీమణి సరస్వతి , ఆత్మకూర్(ఎస్)లో ప్రచారం చేస్తున్న సంకినేని వెంకటేశ్వర్‌రావు సతీమణి లక్ష్మి
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంలో మునిగాయి. అభ్యర్థుల సతీమణులు, తనయులు, సోదరులు, ఇతర బంధువర్గం అంతా రంగంలోకి దిగడంతో పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కుటుంబ సభ్యులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున వారి సతీమణులు, కుటుంబంలోని మహిళలు.. మహిళా ఓటర్లకు బొట్టుపెట్టి, పార్టీ గుర్తులను చూపిస్తూ ఈ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం రోజుకూ పట్టణాల్లో వార్డులు, గ్రామాల్లో ప్రచారం చేస్తూ ముందుకుసాగుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే కుటుంబ సభ్యులు బృందాలుగా ప్రచార రథాలతో బయటకు వెళ్లి సాయంత్రం వరకు వస్తున్నారు. ఇక మిగిలిన ఈ పది రోజుల్లో ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో ప్లాన్ ప్రకారం ముందుకు కదులుతున్నారు.
సూర్యాపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సతీమణి సునీత, ఆయన సోదరుల తనయులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు సతీమణి లక్ష్మి, కుమారులు వరుణ్, అరుణ్, కోడళ్లు సుష్మ, అనూష నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి కుమారుడు సర్వోత్తమ్‌రెడ్డి, ఆయన సోదరులు కృష్ణారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోదాడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ సతీమణి ఇందిర, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి చెల్లెలు భవాని నియోజకవర్గంలో పాల్గొంటున్నారు.
తుంగతుర్తిలో ప్రచారం చేస్తున్న గాదరి కిశోర్ సతీమణి కమల
తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ సతీమణి కమల, బీజేపీ అభ్యర్థి రాంచంద్రయ్య సతీమణి సరస్వతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు.హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి, కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.పద్మావతి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమె రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆయన భార్య రజితారెడ్డి, తల్లి సత్యవతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కుటుంబాలు ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
నేరేడుచర్ల : కందులవారిగూడెంలో ప్రచారం చేస్తున్న శానంపూడి సైదిరెడ్డి సతీమణి రజిత
Comments
Please login to add a commentAdd a comment