ఎమ్మెల్యే దాడి చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదు
అబిడ్స్: బరాత్‌లో డీజేను నిలిపివేసిన తనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా దాడి చేశాడని ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్ పోలీసులు రాజాసింగ్‌లోథాతో పాటు అతని అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే తాను ఎవరిపై దాడి చేయలేదని, ఆ కానిస్టేబుల్ మద్యం తాగి ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరిపించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సైలను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం... ధూల్‌పేట్ బలరాంగల్లీ అరాంగర్ కాలనీకి చెందిన విజయేందర్‌సింగ్ నివాసంలో పెళ్లి ఉండటంతో ట్రాలీలో డీజేను ఉంచి బలరాంగల్లీలో పెద్దశబ్దంతో డీజేను వాయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో బ్లూ కోర్ట్స్-1 సిబ్బంది ఎంబీ చంద్రశేఖర్, మహావీర్‌లు అక్కడికి వెళ్లి.. డీజేకు అనుమతి లేకపోవడంతో నిలిపివేశారు. దీంతో పెళ్లివారు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి విషయం చెప్పగా ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్సై ఆర్.శేఖర్ అక్కడి వచ్చారు.
డీజేను నిలిపివేయడంతో పోలీసులకు, పెళ్లివారికి వాగ్వాదం జరిగింది. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా, ఆయన అనుచరులు ఘటనా స్థలానికి వస్తూనే తమను దూషించి, దాడి చేశారని కానిస్టేబుల్ ఎంబీ చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథాతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్‌పై దాడిచేయడాన్ని పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణ్‌కుమార్ సింగ్ ఖండించారు.
కానిస్టేబుల్ మద్యం తాగి ఉన్నాడు: ఎమ్మెల్యే
విందు జరుగుతున్న ఇంటికి అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ మహిళలను కూడా దూషించాడని ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా అన్నారు. తాను ఆ కానిస్టేబుల్‌ను మద్యం ఎందుకు తాగి వచ్చావని అడిగానని, దాడి చేయలేదని మీడియాకు తెలిపారు. కానిస్టేబుల్ మద్యం తాగి ఉన్న విషయాన్ని అక్కడ ఉన్న మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ ఎస్సైలకు కూడా చెప్పానని, వారు తనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపేసి, తిరిగి తనపైనే ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ధూల్‌పేట్ పరిధిలో రాత్రివేళల్లో ఏ పంక్షన్ అయినా పోలీసులు మద్యం తాగి వచ్చి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఇటీవలే తాను మంగళ్‌హాట్ పోలీసులపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పోలీసుల అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలతో డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథాపై కేసు
Published Sun, May 3 2015 1:27 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement