సాక్షి, హైదరాబాద్: అడవి తల్లినే నమ్ముకున్న గిరిజనులపై అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసి ఇళ్లు కూల్చివేశారని, బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జలగలంచలోని అటవీ ప్రాంతంలో గొత్తికోయలపై అటవీ శాఖ సిబ్బంది విచక్షణారహితంగా దాడులు చేశారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుంటి రవీందర్ పిల్ దాఖలు చేశారు.
గత నెల 16న పస్రా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిరీష, తాడ్వాయి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జోగీందర్ సారథ్యంలో రెండు వందల మంది సిబ్బంది జేసీబీలు, ట్రాక్టర్లు, బుల్‌డోజర్లతో వచ్చి 36 ఇళ్లను కూల్చేశారని పేర్కొన్నారు. తాగు, సాగుకు ఆధారమైన ఏకైక బోరును తొలగించారని, గిరిజనులకు తాగునీరు కూడా లేకుండా చేశారని తెలిపారు. ‘అడ్డుకోబోయినవారిని చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు.
గర్భవతులైన కుంజం
నందిని, మాధవి ఐతై, మాధవి మునితలను కూడా కొట్టారు. అధికారుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే బోర్‌వెల్ ఏర్పాటు చేసి తాగునీటి సదుపాయం కల్పించాలని, కూల్చిన ఇళ్లను నిర్మించాలని, దెబ్బతిన్న ఇండ్లు, పంటలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలివ్వాలి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో దర్యాప్తునకు ఆదేశించాలి. అటవీ అధికారులు శిరీష, జోగీందర్‌లపై క్రిమినల్ చర్యలు
తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment