మళ్లీ నోట్ల కిరికిరి | cash shortfall across the Telangana state | Sakshi
Sakshi News home page

మళ్లీ నోట్ల కిరికిరి

Published Sat, Jun 10 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

మళ్లీ నోట్ల కిరికిరి

మళ్లీ నోట్ల కిరికిరి

రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత తీవ్రతకు ఇది మచ్చుతునక మాత్రమే.

⇒ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నగదు కొరత
⇒ బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. ఏటీఎంలన్నీ ఖాళీ
⇒  అరకొరగా నగదు పంపిణీ చేస్తున్న ఆర్‌బీఐ
⇒  నోట్ల రద్దు తర్వాత పాత నోట్ల డిపాజిట్లు రూ.80 వేల కోట్లు
⇒రాష్ట్రానికి వచ్చిన కొత్త నోట్లు రూ.49 వేల కోట్లే
⇒  మే నుంచి కొత్త నోట్ల సరఫరా పూర్తిగా బంద్‌
⇒  నగదు జమలు తగ్గిపోయాయంటున్న బ్యాంకర్లు
⇒ డబ్బులివ్వకుండా ఖాతాదారులను తిప్పిపంపుతున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న నగదు కొరత తీవ్రతకు ఇది మచ్చుతునక మాత్రమే. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ఎనభై శాతానికిపైగా ఏటీఎంలు పనిచేయటం లేదు. నేరుగా బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాలనుకున్నా.. నగదు లేదనే సమాధానమే వినిపిస్తోంది.

పెద్ద నోట్ల రద్దుకు ముందు సగటున రోజుకు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నగదు లావాదేవీలు నిర్వహించిన బ్రాంచీల్లోనూ ఇప్పుడు పదో వంతు నగదు లావాదేవీలు జరగడం లేదు. దీంతో సాధారణ జనంతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖరీఫ్‌ సీజన్‌ మొదలుకావడంతో రైతులను నోట్ల కష్టాలు వెంటాడుతున్నాయి. నోట్ల కొరత సమస్యపై వారం కింద రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు.. ఆర్‌బీఐ, బ్యాంకు అధికారులతో సమావేశమై సమీక్షించినప్పటికీ పరిస్థితిలో మార్పేమీ రాలేదు.

ఆర్‌బీఐతోనే అసలు పేచీ!
గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రాష్ట్రంలో రూ.80 వేల కోట్లకు పైగా పాత రూ.500, రూ.1,000 నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. కానీ అంత మొత్తానికి సరిపడా కొత్త నోట్లను ఆర్‌బీఐ ఇప్పటికీ సరఫరా చేయలేకపోయింది. ఇప్పటివరకు తెలంగాణకు పంపిణీ చేసిన కొత్త నోట్లు కేవలం రూ.49 వేల కోట్లేనని ఆర్‌బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇక మే నెల నుంచి అయితే కొత్త నోట్ల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. రోజువారీ లావాదేవీల్లో భాగంగా బ్యాంకులకు వచ్చే నగదునే అన్ని బ్యాంకులకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. దీంతో నోట్ల సమస్య మళ్లీ తీవ్రమైంది. బ్యాంకుల నుంచి తమకు ఆశించినంత నగదు రావడం లేదని.. అందుకే ఏటీఎంలు, బ్రాంచీలకు సరిపడేంత నగదు ఇవ్వలేకపోతున్నామని ఆర్‌బీఐ
అధికారులు చెబుతున్నారు.

ఆర్‌బీఐకి లేఖ రాసిన ప్రభుత్వం
నోట్ల కొరతను అధిగమించేందుకు తెలంగాణకు సరిపడేంత నగదు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రిజర్వుబ్యాంకుకు లేఖ రాసింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మార్చి నెలలో పరిస్థితి కుదుటపడిందని, ఏటీఎంలు సైతం వినియోగంలోకి వచ్చాయని అందులో పేర్కొంది. అయితే ఏప్రిల్‌ నుంచి మళ్లీ నోట్ల మొదలైందని.. క్రమంగా ఏటీఎంలన్నీ మూతపడ్డాయని వివరించింది. మే నెల నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైందని.. దీని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐకి విజ్ఞప్తి చేసింది. డిజిటల్‌ లావాదేవీలు పెరిగినప్పటికీ నగదు కొరతతో అన్ని వర్గాలూ ఇబ్బందులకు గురవుతున్నాయని వివరించింది.

డబ్బు జమ చేసేవారేరీ?
బ్యాంకుల్లో రోజువారీ నగదు జమలు గణనీయంగా పడిపోయాయని, అందుకే తాము రిజర్వుబ్యాంకుకు నగదును పంపలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకే తప్ప.. జమ చేసేందుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని ఇటీవలి సమీక్షలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచారమే అందుకు కారణమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు ఆర్‌బీఐ ఒక్కో బ్యాంకు బ్రాంచీకి రోజుకు మూడు నాలుగు లక్షలకు మించి నగదు ఇవ్వడం లేదని బ్యాంకర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఖాతాదారులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నామని.. ఏటీఎంలో లక్ష రూపాయలు అందుబాటులో ఉంచితే అరగంటలో ఖాళీ అవుతున్నాయని నివేదించారు. మొత్తంగా ఆర్‌బీఐ, బ్యాంకుల మధ్య సమన్వయ లోపంతో నగదు కొరత మరింత పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది.

‘సార్‌.. నాకు అత్యవసరంగా లక్ష రూపాయలు కావాలి. ఆస్పత్రిలో బిల్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులో ఏడాది కింద రూ. లక్షన్నర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. ఇదిగో బాండ్‌ కూడా తెచ్చాను. డబ్బులివ్వండి..’
                                                                      – ఓ ఖాతాదారుడి అభ్యర్థన.

‘అత్యవసరమున్నా మీరడిగిన డబ్బులివ్వలేం. ఆస్పత్రికి వెళ్లి వాళ్ల ఖాతా వివరాలు తీసుకురండి. ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేస్తాం. ఆర్‌బీఐ మా బ్యాంకుకు రోజుకు రూ.3 లక్షలకు మించి ఇవ్వడం లేదు’
                                                               – బంజారాహిల్స్‌ ఎస్‌బీఐ కార్పొరేట్‌ బ్రాంచి సమాధానమిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement