ఎన్నారై అల్లుడికి గిల్లుడే! | CCS Officials Check to NRI Grooms in Extra Dowry Cases Hyderabad | Sakshi
Sakshi News home page

అల్లుడికి గిల్లుడే!

Published Fri, Mar 6 2020 8:44 AM | Last Updated on Fri, Mar 6 2020 12:33 PM

CCS Officials Check to NRI Grooms in Extra Dowry Cases Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన వరకట్నం, వేధింపుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ‘ఎన్నారై అల్లుళ్ల’కు చెక్‌ చెప్పడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ అయిన వారి పాస్‌పోర్ట్స్‌ రద్దు చేయించడానికి సిద్ధమవుతున్నారు. రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు (ఆర్పీఓ) లేఖలు రాయడం ద్వారా వాంటెడ్‌ అల్లుళ్ల మెడలు వంచుతున్నారు. సీసీఎస్‌ అధికారులు ఇప్పటికే 40 మందిపై ఈ చర్యలు తీసుకుకోగా.. వారంతా హుటాహుటిన వచ్చి కేసు రాజీ చేసుకోవడమో, కోర్టుకు హాజరై ఎన్‌బీడబ్ల్యూ రీకాల్‌ చేసుకోవడమో చేశారు. 

నోటీసులు ‘రంగు’ మారడంతో..
అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న, ఎన్నో విధాలుగా మోసం చేసిన ఎన్నారై అల్లుళ్లకు సంబంధించిన కేసులు పోలీసుల వద్దకు నిత్యం వస్తున్నాయి. ప్రధానంగా సిటీలో ఉన్న మూడు మహిళా ఠాణాలకు బాధితులు క్యూకడుతుంటారు. సీసీఎస్‌ అధీనంలోని మహిళా పోలీసుస్టేషన్‌కు వచ్చే కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. వివాహం చేసుకుని తీసుకెళ్లట్లేదని, అక్కడకు వెళ్లాక కట్నం కోసం మానసికంగా, శారీరకంగా హింసించాడని, లేని అర్హతలు చెప్పి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తుంటారు. వీటిపై కేసులు నమోదు చేసుకుంటున్న పోలీసులు నిందితులుగా ఉన్న ‘అల్లుళ్లను’ అరెస్టు చేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకప్పుడు 498 (ఎ) తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎన్నారైలను అరెస్టు చేసేందుకు సీఐడీ ద్వారా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించేవారు.

ఆ సంస్థ ద్వారా రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించి, ఆయా దేశాల్లో ఉన్న పోలీసులు పట్టుకునేలా చేసి ఇక్కడకు తీసుకువచ్చేవారు. భారత్‌లో మాదిరిగా అన్ని దేశాల్లోనూ వరకట్న వేధింపులు అనేది తీవ్రమైన నేరం కాదు. దీంతో కొన్నేళ్ల క్రితం నుంచి ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసుల జారీ ఆపేసింది. వీటి స్థానంలో బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేస్తూ.. కేవలం నిందితులకు సంబంధించిన ఆచూకీ తెలిపేందుకు మాత్రమే పరిమితమైంది. ఈ రకంగా వారి ఆచూకీ తెలిసినా.. ఇక్కడి పోలీసులు వెళ్లి తీసుకురావడం అసాధ్యమైంది. ఇది వాంటెడ్‌గా ఉన్న ఎన్నారై అల్లుళ్లకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. 

దిగితేనే పట్టుకోవడానికి అవకాశం..
ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్, బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేయించడం అంత సులువు కాదు. ఇందులో సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. స్థానిక పోలీసులు నేరుగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించలేరు. నోడల్‌ ఏజెన్సీగా పని చేసే సీఐడీ వంటి వ్యవస్థల ద్వారా వెళ్లాలి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ కావడంతో ఇటీవల కాలంలో పోలీసులు వాంటెడ్‌గా ఉన్న ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ చేస్తున్నారు. దీన్ని దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకూ పంపిస్తారు. ఎల్‌ఓసీ జారీ అయిన వ్యక్తి వ్యక్తిగత, కేసు వివరాలతో పాటు పాస్‌పోర్ట్‌ నంబర్లను విమానాశ్రయాల్లో ఉండే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తమ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసుకుంటారు. అతడు విమానం దిగిన  వెంటనే జరిగే ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల్లో వాంటెడ్‌ అని వెలుగులోకి రావడంతోనే అదుపులోకి తీసుకుని సంబంధిత పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులు వచ్చి నిందితుడిని తీసుకువెళ్లే వరకు ఎయిర్‌పోర్ట్‌ దాటకుండా తమ అధీనంలోనే ఉంచుకుంటారు. అంతర్జాతీయ ప్రయాణాలకు ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలనేది కచ్చితమైన అంశం. ఎల్‌ఓసీలు జారీ చేస్తే కేవలం ఆ నిందితుడు ఒక్కడికి వస్తేనే పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 

రద్దు కోరుతూ ఆర్పీఓలకు లేఖలు..
దీంతో ఎన్నారై అల్లుళ్లకు చెక్‌ చెప్పడానికి అనువైన మార్గాలను సీసీఎస్‌ పోలీసులు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే వీరు పాస్‌పోర్ట్‌ చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు. అందులో ఉన్న కొన్ని సెక్షన్ల ప్రకారం న్యాయస్థానాలకు వాంటెడ్‌గా ఉండి, విదేశాల్లో తలదాచుకున్న వ్యక్తి పాస్‌పోర్ట్‌ను రద్దు చేయించే అధికారం పోలీసులకు ఉంది. దీని ప్రకారం ఆర్పీఓలకు లేఖలు రాయాలంటే అతడిపై న్యాయస్థానం ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయాల్సి ఉంది. దీనికోసం ఆయా కేసుల దర్యాప్తు పూర్తి చేసుకున్న అధికారులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. వీటి ఆధారంగా ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయించి, ఆర్పీఓలకు లేఖ రాస్తున్నారు. విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా నిందితుడు ఉన్న దేశంలోని రాయబార కార్యాలయానికి సందేశం ఇస్తున్న ఆర్పీఓ.. పాస్‌పోర్ట్‌ రద్దుపై అతడికి నోటీసులు జారీ చేస్తోంది. అదే జరిగితే ఉద్యోగం కోల్పోవడంతో పాటు స్వదేశానికి డిపోర్ట్‌ కావడం, తిరిగి విదేశాలకు వచ్చే అవకాశాలు సన్నగిల్లడం తప్పదనే విషయం తెలిసి ఉండటంతో ‘ఎన్నారై అల్లుళ్లు’ విమానాలు దిగుతున్నారు. భార్యలతో రాజీలు చేసుకోవడమో, కోర్టులకు హాజరై ఎన్‌బీడబ్ల్యూలు రీకాల్‌ చేయించుకోవడమో చేస్తున్నారని సీసీఎస్‌ పోలీసులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement