సంక్రాంతి వచ్చే.. సంబరాలు తెచ్చె
సంబరాలు తెచ్చింది. ఆడపడుచుల ముత్యాల ముగ్గులు.. పత ంగుల రెపరెపలు.. డూ..డూ బసవన్నల సయ్యాట.. వలస వెళ్లిన కూలీల రాకతో పల్లెలు కళకళలాడుతున్నాయి. సకినాలు, బొబ్బట్లు, పిండివంటల రుచులు మనసును దోచేస్తున్నాయి. జిల్లాలో సంక్రాంతిని కీడు పండుగ అని భావించినా.. ప్రతిఇంటా జరుపుకుంటారు. కొత్త బట్టలు కొనకపోయినా.. కోటిదేవతలను పూజిస్తారు..! బండ్లు బోనాలు, తిరునాళ్లతో సంబరాలు ప్రారంభమవుతాయి. సింగోటం బ్రహ్మోత్సవాలు, అచ్చంపేట నిరంజన్‌షావలీ గంధోత్సవం సంక్రాంతి నుంచే ప్రారంభమవుతాయి. - ఆత్మకూర్/షాద్‌నగర్
ముగ్గుల సందడి
సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు.. యువతులు, మహిళలు కొంగొత్త ముగ్గులు వేయడం నేర్చుకుంటారు. వేకువజామునే లేచి కళ్లాపి జల్లి వాకిళ్లను సిద్ధంచేస్తారు. రంగురంగుల ముగ్గులతో అందరి ముందు తమ ప్రతిభ చూపుతుంటారు. సంక్రాంతికి తొలి అడుగు ముంగిట వేసే ముగ్గులే.. పల్లెల్లో రంగురంగుల ముగ్గులు ఆహ్వానం పలుకుతున్నాయి. దీనికితోడుగా పలు సంఘాలు, సంస్థలు ముగ్గులపోటీల నిర్వహణతో పాటు నేటి తరాలను సంస్కృతి పరిరక్షణ దిశగా ప్రోత్సహిస్తుండటం విశేషం.
డూ..డూ బసవన్న..
అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు..!అంటూ డూడూ బసవన్నలతో సందడి చేసే గంగిరెద్దుల అంతాఇంతాకాదు. పచ్చని పం టలుపండించే రైతు లు పాలిచ్చే గో వును దైవంగా భావించి దానిని వస్త్రాలతో అలంకరించి కొ త్తగా ఇంటికొచ్చిన ధాన్యాన్ని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నేటి తరాలకు ఈ ప్రాధాన్యతను తెలియజేసేందుకు కొన్ని సంస్థలు కళాకారుల ద్వార ప్రదర్శనలు ఇప్పిస్తున్నాయి.
నేడు భోగి భోగి మంటలు..
భోగుల్లో.. భోగుల్లో..భోగభాగ్యాల భోగుల్లో.. భోగి మంటలా భోగుల్లో..! అంటూ గ్రామీణ ప్రాంతాల్లో భోగిమంటల సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాత వస్తువులను పాతర పెట్టి కొత్త వస్తువులు స్వాగతం పలికే ఈ కార్యక్రమం ద్వారా ఆనందాలు పంచుకోవడం ప్రత్యేకం.. అందుకే అన్ని వర్గాలను అలరించే పండగగా సంక్రాంతి మన్ననలు అందుకుంటుంది.
బొమ్మల కొలువు..
ఇది సంక్రాంతి వేళ ఇంటింటా కనిపించే అపురూపమైన దృశ్యం. రకరకాల బొమ్మలను పేర్చి ఇంటిని శోభాయమానంగా అలంకరించడం ఆనవాయితీ. దీనితో పాటు చిన్నారులకు రేగిపళ్లు, జోడిపళ్లు, చెరుకు ముక్కలతో దిష్టితీస్తారు. ఇరుగుపొరుగు వారిని పిలిచి అన్నదానం వంటి కార్యక్రమాలను చేపడతారు.
పిండివంటల రుచి
ఎంతో రుచికరమైన వంటలు చేసుకోవడం సం క్రాంతి రోజున వస్తోంది. ఈ సందర్భంగా చేసే నువ్వుల రొట్టెలు, కలియగూర, వేరుశనగబెల్లంతో చేసే ఉండలు శరీరానికి ఎంతో బలాన్నిస్తాయి. ఈ వర్తమానంలో విపరీతంగా ఉండే చలిని తుట్టుకునే శక్తిని ఇవ్వడమే కాకుండా రానున్న వేసవిలో ఎండను తట్టుకునే శక్తినిస్తాయి. అందుకే సంక్రాంతి వేడుకల్లో ఇవి ప్రత్యేకతనిస్తాయి.
అయ్యారే గాలిపటం..
అవును గాలిపటం కనిపిస్తే చాలు..అయ్యారే అంటూ తాము తయ్యారే అంటారు చిన్నారులు.. సంక్రాంతి వేడుకలకు ముందునుంచి సంక్రాంతి వేడుకలు పూర్తయ్యేవరకూ గాలిపటాలు కనిపిస్తుంటాయి. అందుకే చిన్నారులకు అత్యంత ఇష్టమైన పండగగా నేటికీ సంక్రాంతి కనువిందు చేస్తోంది. వీరి ఆసక్తికి తగినట్టుగానే మార్కెట్‌లో రంగురంగుల గాలిపటాలు సందడి చేస్తున్నాయి.