సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం
- స్విచ్‌బోర్డు నుంచి చార్జర్ జారిపడటంతో వ్యక్తికి స్వల్పగాయాలు
- ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు
కందుకూరు: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతలోనే అదృష్టవశాత్తు చార్జర్ స్విచ్‌బోర్డు నుంచి జారికింద పడిపోవడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అన్నోజిగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనెమోని రవి(35) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతున్నాడు.
ఈక్రమంలో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతలోనే చార్జర్ స్విచ్‌బోర్డు నుంచి జారి కిందపడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రవి కుడిచేతి వేలికి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్, ఆనెమోని సుధాకర్ ఇంటి గోడలకు శనివారం రాత్రి కరెంట్ ప్రసారమవడంతో గమనించిన వారు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తరచూ ప్రమాదాలు..
గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎర్తింగ్ సమస్యతో గ్రామానికి చెందిన ఢిల్లీ రాములు విద్యుత్‌షాక్‌తో మృత్యువాత పడ్డాడని, పలువురు తీవ్రగాయాలకు గురయ్యారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు స్పందించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.