ఆడుకుంటూ అనంతలోకాలకు
- చిన్నారిని చిదిమేసిన ట్రాన్స్‌ఫార్మర్
- విద్యుదాఘాతానికి బాలుడి మృతి
- అధికారుల నిర్లక్ష్యమే కారణం
జగద్గిరిగుట్ట: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటూ అక్కడే ఉన్న కంచెలేని ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ప్రభాకర్, శోభ దంపతులు మైసమ్మనగర్‌కు వలస వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి కుమారుడు విష్ణు (5) సంతానం. భార్యాభర్తలిద్దరూ గురువారం కూలి పనులకు వెళ్లగా.. ఇంటి వద్దే ఉన్న విష్ణు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ఇంటి ముందు ఉన్న అరుగుపై ఆడుకుంటూ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.
కుటుంబానికి న్యాయం చేయాలి..
ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుపెంచి, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోపోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ బాలుడి మృతదేహంతో సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ అధికారులు, పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు.