- కరెంటు బిల్లులకు కేంద్రం నిధులు
- టీ-సర్కార్ ఆదేశాలపై సర్పంచుల అసంతృప్తి
- హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయం
- రద్దయిన బీఆర్‌జీఎఫ్
- నేటికీ విడుదల కాని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, మంచిర్యాల : అత్త సొమ్ము.. అల్లుడు దానం చేసినట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం. పల్లెల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు పంచాయతీలకు మంజూరైన 13వ ఆర్థిక సం ఘం నిధుల్లో 80శాతం డబ్బులు విద్యుత్ బకాయిల కోసం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 13వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.19.30 కోట్లు వచ్చాయి. వీటిలో 80శాతం నిధులతో బకాయి లు చెల్లిస్తే.. రూ.15 కోట్లు అవుతుంది. మిగిలిన రూ.4.30 కోట్లతో జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో తెలియక సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
అంతేకాదు.. కేంద్రం ఏటా విడుదల చేస్తున్న వెనకబడి న ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్‌జీఎఫ్) నిధులను ఇటీవల రద్దు చేసింది. దీంతో పల్లెల అభివృద్ధి పడకేసినట్లయింది. ఇటు టీ-సర్కార్.. ఈ సంవత్సరం రాష్ట్ర ఆర్థిక సం ఘం కింద నయాపైసా విదల్చలేదు. తన గ్రాంట్ల నుంచి ఇంత వరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వని టీ-సర్కార్ కేంద్రం నిధులను కరెంట్ బిల్లులకు చెల్లించాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని.. ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే.. ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఆందోళనలు చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. మరోపక్క.. ఏళ్ల క్రితం నాటి బిల్లుల భారమూ ప్రస్తుత సర్పంచులు మోయాల్సిందేన ంటున్న ప్రభుత్వ తీరుపై సర్పంచులు మండిపడుతున్నారు. తాము అధికారంలో లేనప్పుడు పేరుకుపోయిన బిల్లుల భారం తమపై మోపడం తగదని.. ఆ సమయంలో ఎలాంటి మీటర్ రీడింగులు లేకుండా అధికారులు విద్యుత్ బకాయిలు ఖరారు చేయడాన్ని త ప్పుబడుతున్నారు. టీ-సర్కార్ తీరుకు నిరసనగా న్యాయపోరాటం చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలత స్పష్టం చేశారు.
కేంద్రం నిధులపైనే దృష్టి..!
పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లింపు భారమంతా కేంద్రం నిధులతోనే పూడ్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో ఆయా ప్రభుత్వాలే పంచాయతీల కరెంట్ బిల్లులు చెల్లించేవని సర్పంచులు చెబుతుంటే.. గతంలో కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధుల్లో కోత విధించి ఆయా ప్రభుత్వాలు పంచాయతీలకు డబ్బులు విడుదల చేసేవని ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో మూడు నెలల క్రితం పంచాయతీలకు వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 15శాతం విద్యుత్ బకాయిల కోసం చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చే సిన విషయం తెలిసిందే.
సర్పంచులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో ఆ సమయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఇప్పుడు తాజాగా.. 80శాతం నిధులు విద్యుత్ బకాయిల కోసం ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికార పార్టీ సర్పంచుల్లోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం నిధులతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి పథకాల నిర్వహణ, స్టేషనరీ, కమాటీల వేతనాలు ఇతర పనులు చేపడతారు. ఈ నిధుల్లోంచి ఎక్కువగా విద్యుత్ బకాయిల కోసం చెల్లిస్తే.. క్షేత్రస్థాయిలో పై పనుల నిర్వహణ ఏమిటని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా విద్యుత్ బిల్లుల చెల్లింపు విషయంలో టీ-సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం - సర్పంచుల మధ్య దూరాన్ని పెంచుతోంది.
ప్రశ్నార్థకంగా పల్లెల అభివృద్ధి
కేంద్ర నిధుల నుంచి 80శాతం కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం.. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్‌జీఎఫ్) రద్దు కావ డం.. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇంత వరకు విడుదల కాకపోవడంతో జిల్లాలో పల్లెల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకాల ద్వారా ఒక్కో పంచాయతీకి జనాభాను బట్టి రూ.60వేల నుంచి రూ.2లక్షల వరకు మంజూరవుతుంది. మరోపక్క.. జిల్లాలో ఉన్న 866 గ్రామ పంచాయతీల నుంచి ఏటా వివిధ రకాల పన్నులు రూ.17 కోట్లకు పైగా వసూలు కావాల్సి ఉండగా.. సిబ్బంది కొరతతో ఆశించిన మేరకు వసూళ్లు జరగడం లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.9 కోట్లకు మించి పన్నులు వసూలు కావడం లేదు.
ఫలితంగా పల్లెలు సమస్యల వలయాల్లో చిక్కుకుపోతున్నాయి. ఇప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 80శాతం కరెంట్ బిల్లుల కోసం ఖర్చు చేస్తే జిల్లాలో పల్లెల పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి పోచయ్యను సంప్రదించగా..‘ప్రభుత్వ ఆదేశాల మేరకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో 80శాతం డబ్బులు కరెంట్ బిల్లుల కోసం కేటాయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు’ అని చెప్పారు.
క‘రెంటు’ పోరు
Published Mon, Apr 20 2015 2:44 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement