విద్యుత్ చార్జీలపై ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ:
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమల్లోకి తీసుకొచ్చిన 50 శాతం విద్యుత్ చార్జీల మాఫీకి బ్రేకుపడింది. దీనిని అమలు చేయకూడదంటూ హైకోర్టు బుధవారం ఢిల్లీ ప్రభుత్వా న్ని ఆదేశించింది. ఈ కేసుపై ఈ నెల 21వ తేదీన విచారణ చేపట్టాలని నిర్ణయించిన ధర్మాసనం... అప్పటిదాకా తదుపరి చర్యలకు ఉపక్రమించొద్దంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వపు ప్రతిపాదన కేవలం ప్రకటనేనా? లేక మంత్రిమండలి నిర్ణయం తీసుకుందా ? అనే విషయమై వాస్తవస్థితిని స్పష్టం చేస్తూ అఫిడవిట్ సమర్పించాలని న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
కాగా షీలాదీక్షిత్ ప్రభుత్వ హయాంలో అధిక విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ‘బిజ్లీ సత్యాగ్రహ’ ఉద్యమానికి సహకరించి బిల్లులు చెల్లించని 24 వేలపైగా వినియోగదారుల విద్యుత్తు బిల్లులను అక్టోబర్ 2012 నుంచి మే 2013 వరకు 50 శాతం మాఫీ చేసినట్లు కేజ్రీవాల్ సర్కారు ప్రకటించింది. బిల్లులు చెల్లించని వినియోగదారులకు జరిమానా విధించడానికి బదులు 50 శాతం మాఫీ చేయాలని కేజ్రీవాల్ సర్కారు చేసిన ప్రకటన అరాచకానికి, గందరగోళానికి దారితీస్తుందంటూ వివేక్ నారాయణ్‌శర్మ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి విదితమే. ఆప్ నేతలు నియమాలను పాటించనివారిని ప్రోత్సహించారని, అందువల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. ఆరు కోట్ల మేర అదనపు భారం పడిందని వివేక్ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు బిడి అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం కేజ్రీవాల్ సర్కారు ప్రకటన మాత్రమే చేసిందా లేక బకాయి బిల్లులను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందా? అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం దీనిపై ఓ అఫిడవి ట్ దాఖలు చేసిందని, అయితే ఇందుకు సంబంధిం చి కేబినెట్ సమావేశం జరగలేదని తాము భావించామని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పష్టత లేదంది. అందువల్ల ఇది కేబినెట్ నిర్ణయమా కాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఇదిలాఉంచితే అప్పటి మంత్రి మనీష్ సిసోడియా చేసిన ప్రకటనను బట్టి ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసినట్లే కనిపిస్తోందని, ఆప్ సర్కారు తీసుకున్న ప్రధాన నిర్ణయాలన్నింటినీ కొనసాగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఫైలును పరిశీలించామని. సబ్సిడీ ప్రతిపాదనను కేబినెట్ ముందుంచాలంటూ అప్పటి ముఖ్యమంత్రి పేర్కొన్న నోట్ మాత్రమే తమకు అందులో కనిపించిందని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదని ఫైళ్లు చెబుతున్నందువల్ల వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయాలంటూ న్యాయస్థానం ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఇదిలాఉంచితే 2,508 వినియోదారులపై గత సంవత్సరం దాఖలైన విద్యుత్ చౌర్యం కేసులను మూసివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా వివేక్‌శర్మ సవాలు చేశారు. ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చర్యలను ప్రోత్సహించేదిగా ఉందని వివేక్ శర్మ పేర్కొన్నారు.
‘మాఫీ’ ఆపండి
Published Wed, Feb 19 2014 11:49 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement