బయ్యారంలో పీపీపీ విధానంలో స్టీలు ప్లాంటు
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ముడి సరుకులో నాణ్యత లేనందున ఛత్తీస్‌గఢ్ తరహాలో పీపీపీ విధానంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు ఉక్కు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ తన కార్యాలయానికి వచ్చిన ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో ఈ అంశంపై సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘బయ్యారంలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించాయి. పునర్ వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తరువాత కేంద్రం ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించి యోగ్యత అధ్యయనం చేయించింది. అయితే ఇక్కడ లభించే ఐరన్ ఓర్‌లో మ్యాగ్నటైట్ ఎక్కువగా ఉంది. హెమటైట్ తక్కువగా ఉంది. అందువల్ల విశాఖ తరహాలో భారీ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు యోగ్యత లేదని టాస్క్‌ఫోర్స్ తేల్చింది. దీనిపై నేడు మరోసారి ఉక్కు మంత్రితో సమీక్ష జరిపాం. ఉన్న ముడి వనరులతో పీపీపీ విధానంలో ఒక సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు సూత్ర ప్రాయ అంగీకారం తెలిపినట్టు ఉక్కు మంత్రి తెలిపారు.
తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు, సెప్టెంబరులోగా ఈ నివేదిక పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. మ్యాగ్నటైట్ గల ఓర్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో స్టీలు ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో బయ్యారంలో కూడా కేంద్రం, రాష్ట్రం, సెయిల్, ప్రయివేటు భాగస్వామితో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నాం..’ అని దత్తాత్రేయ పేర్కొన్నారు.
జాతీయ రూర్బన్ మిషన్ కింద...
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో కూడా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రూర్బన్ మిషన్ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్ జిల్లాలోని రాయకల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను ఎంపిక చేశారని వివరించారు. ఆయా ప్రాంతాలకు భారీగా నిధులు దక్కనున్నట్టు మంత్రి వివరించారు. ఇదే పథకం కింద చౌటుప్పల్, కల్వకుర్తి ప్రాంతాలను చేర్చాలని విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు.
అలాగే యూపీఏ హయాంలో ‘పుర’ పథకం కింద వరంగల్లు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారని, ఈ పథకం రద్దయిన నేపథ్యంలో తిరిగి దీనిని పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న సన్నూరు, అన్నారం షరీఫ్, కొలనుపాక గ్రామాలకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అనుసంధానించాలని కోరినట్టు తెలిపారు.