కరువు సాయం రూ. 791 కోట్లు
కేంద్ర అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం
తెలంగాణకు ఇదే అత్యధికం: కేంద్ర మంత్రి రాధామోహన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు కరువు సాయంగా రూ. 791 కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ గురువారం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహ ర్షి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను, కేంద్ర బృందం కరువు ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలన జరిపి అత్యున్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయానికి వచ్చింది. సమావేశం అనంతరం రాధామోహన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మునుపెన్నడూ ఇంత మొత్తంలో తెలంగాణకు కరువు సాయం అందలేదని, ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇంత మొత్తంలో సాయం లభించలేదని ఆయన తెలిపారు. దాదాపు రూ. 2,500 కోట్ల మేర కరువు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రెండు రోజుల క్రితమే రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కూడా ఢిల్లీ వచ్చి రాధామోహన్‌సింగ్‌ను కలసి ఈ విషయంపై చర్చించారు.