ముఖ్యమంత్రికి కోపం ఎందుకో: చాడా
ముఖ్యమంత్రికి కోపం ఎందుకో: చాడా
Published Mon, Mar 27 2017 6:20 PM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. హామీలను గుర్తు చేస్తుంటే ఎందుకు అంత అసహనమని సీఎంను ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ తలపెట్టిన చలో అసెంబ్లీ భగ్నం అయ్యింది. ఉదయం నుంచే హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఎర్ర జెండాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి వచ్చిన వారందర్నీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించారన్నారు.. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇలా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయమని గుర్తు చేస్తుంటే మాపై ఆయనకు ఎందుకంత కోపం వస్తుందో అర్థం కాలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Advertisement