
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతన్నల ఆత్మహత్యలపై చర్చ జరుగుతోందని, ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండవ స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై, సమస్యలపై సినిమా తీస్తే పాలకులు అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు.
నారాయణమూర్తి తీసిన ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను సెన్సార్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆదివారం మఖ్దూంభవన్‌లో వామపక్ష పార్టీల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి, గోవర్ధన్, సీపీఎం నేత నర్సింగ్‌రావు, సజయ, విమలక్క, టీజేఎస్ సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ, జీఎస్టీ, నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలనే విషయాలు ఈ సినిమాలో పొందుపర్చడం సెన్సార్‌కు, అటు ప్రభుత్వానికి నచ్చలేదని వారు విమర్శించారు. సెన్సార్ బోర్డు ప్రభుత్వాలకు వత్తాసు పలకడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే సినిమాలకు అనుమతి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.
సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వండి: రైతు సంఘం
సాక్షి, అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తల రుణాల ఎగవేత, బ్యాంకుల వైఫల్యం, పాలకుల తీరును ఎత్తిచూపిన సన్నివేశాలను తొలగించమనటం ఏం న్యాయమని ప్రశ్నించింది.
కాగా, భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకోవడం కేంద్రానికి తగదని రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’చిత్రంపై సెన్సార్ బోర్డు ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment