భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి స్నాచర్లు 7 తులాల బంగారు గొలుసును అపహరించారు.
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి స్నాచర్లు 7 తులాల బంగారు గొలుసును అపహరించారు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... చిక్కడపల్లికి చెందిన వరప్రసాద్ జీవీకే సంస్థలో కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో భార్య గీతతో కలిసి తన ద్విచక్ర వాహనంపై చిక్కడపల్లి నుంచి బేగంపేట్ వెళుతున్నారు. మినిష్టర్‌రోడ్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు రాగానే ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు వీరి వాహనాన్ని అదుపు తప్పేలా చేసి గీత మెడలో ఉన్న 7తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు.
వాహనం అదుపు తప్పుతుందనే కంగారులో ఉన్న వరప్రసాద్ తేరుకునే లోపు వారు మాయమయ్యారు. నిందితుల్లో ఒకరు నలుపు రంగు జర్కిన్ ధరించి ఉన్నాడని అలాగే నలుపు రంగు కళ్ల జోడు పెట్టుకున్నాడని వరప్రసాద్ తెలిపారు. అనంతరం వారు రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.