
జెడ్పీ చైర్‌పర్సన్లకు మరో నజరానా
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల్లకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని శుక్రవారం ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు..
- జెడ్పీ చైర్‌పర్సన్లకు కొత్త వాహనాలు
- సొంత భవనాల్లేని జెడ్పీలకు కొత్తగా నిర్మాణం
- ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి
- జెడ్పీ చైర్‌పర్సన్ల సమావేశంలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల్లకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనాన్ని శుక్రవారం ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు.. తాజాగా వారికి మరో నజరానాను కూడా ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్లందరికీ కొత్త వాహనాలను కూడా సమకూరుస్తామని శనివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం హామీ ఇచ్చారు. అలాగే సొంత భవనాల్లేని జిల్లా పరిషత్‌లకు కూడా ఆయా జిల్లాల్లో నూతన భవనాలను నిర్మించేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ జెడ్పీ చైర్‌పర్సన్లందరూ స్థానికంగా జిల్లా కలెక్టర్లతో సమన్వయంగా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
గతంలో జిల్లా పరిషత్‌లకు ఉండే 29 అధికారాలను తిరిగి కల్పించాలని పలువురు జెడ్పీ చైర్‌పర్సన్ల్లు సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈవిషయమై విస్తృతంగా చర్చించిన సీఎం జెడ్పీ చైర్‌పర్సన్ల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్లను సీఎం కేసీఆర్ కోరారు. ఈ సమావేశానికి అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ మినహా మిగిలిన అన్ని జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్లు హాజరయ్యారు.
అంతకుముందు తమకు గౌరవ వేతనాలను పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌కు జెడ్పీ చైర్మన్లందరూ కృతజ్ఞతలు తెలిపారు. గౌరవవేతనాలను పెంచినందున ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీలు, పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు మంత్రి కేటీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఉన్న 12వేల మంది వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలంటూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఫోరం డిమాండ్ చేసింది. తమ హక్కుల సాధన కోసం ఈనెల 16న జరిగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సమావేశంలో కార్యాచరణను ప్రకటిస్తామని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.