సాక్షి, సిటీబ్యూరో: ఒకరు వాహనంపై దూసుకుపోతూ సిగరెట్ కాలిస్తే... మరొకరు రోడ్డు పక్కనే ధూమపానం చేస్తారు... కేఫ్‌లో తాపీగా కూర్చొని పొగ తాగుతారు ఇంకొకరు... ఇకపై ఇలా చేస్తూ పోలీసుల కంటపడితే జరిమానా తప్పదు. ‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ దిశగా అడుగులు వేస్తున్న నగర పోలీసులు సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకునేందుకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ విభాగాల్లోని కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని నగర కొత్వాల్ అంజనీకుమార్ సోమవారం బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ప్రారంభించారు.
ఇప్పుడు విరివిగా వినియోగిస్తున్న సిగరెట్, బీడీ, చుట్ట, ఖైనీ తదితరాల్లోని పొగాకు అంటే ఒకప్పుడు భారతీయులకు తెలియదు. అయితే 400 ఏళ్ల క్రితం మొఘలుల పరిపాలనలో దీన్ని పోర్చుగల్ నుంచి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో పొగాకు వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. గ్రామీణ ప్రాంతాల్లో 38శాతం, పట్టణాల్లో 25శాతం దీనికి బానిసయ్యారు. ఈ ప్రభావంతో ఏటా 8–9లక్షల మంది మరణిస్తున్నారు. 30శాతం కేన్సర్ కేసులు, 40శాతం టీబీ కేసులకు ఇదే కారణమవుతుండగా... నోటి కేన్సర్ బారినపడిన వాళ్లల్లో 80శాతం మంది పొగాకు వాడుతున్న వాళ్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న చండీగఢ్ నగరం 2007లో, సిక్కిం రాష్ట్రం 2010లో స్మోక్ ఫ్రీగా మారాయి. హైదరాబాద్‌ను కూడా స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించుకున్న నగర పోలీసులు స్వచ్ఛంద సంస్థ ‘ది యూనియన్’తో కలిసి ముందుకెళ్తున్నారు.
లక్ష్యం.. అక్టోబర్ 2
‘స్మోక్ ఫ్రీ హైదరాబాద్’ లక్ష్యాన్ని గాం«ధీ జయంతి (అక్టోబర్ 2) నాటికి సాధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఆ నెల 30 నుంచి నగరంలో ‘50వ ప్రపంచ ఊపిరితిత్తుల ఆరోగ్య సదస్సు’ జరగనుంది. అది ప్రారంభమయ్యే లోపే లక్ష్యాన్ని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా మొదలైన స్పెషల్ డ్రైవ్స్ ఈ నెల 31న జరగనున్న ‘ప్రపంచ నో టొబాకో డే’తో వేగం పుంజుకోనున్నాయి. ఈ క్రతువులో శాంతిభద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పాలుపంచుకుంటారు. అనునిత్యం రహదారులపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులు, గస్తీ తదితర విధుల్లో ఉండే శాంతి భద్రతల విభాగం అధికారులు సైతం బహిరంగ ప్రదేశాల్లోని పొగరాయుళ్లపై కొరడాఝుళిపిస్తారు. తమ వద్ద ఉండే ట్యాబ్స్‌ను వినియోగించి వారికి జరిమానా విధిస్తారు.
దీంతో పాటు సిగిరెట్–పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన ‘కోట్పా’ చట్టాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. దీనిపైనే సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణనిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పొగతాగే వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా అమ్మేవాళ్లు, ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకోనున్నారు.
జరిమానాలు ఇలా...
♦ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.200.
♦ హోటల్, కేఫ్ లాంటి ప్రదేశాల్లో ధూమపానం చేస్తే అక్కడ ఎంతమంది పొగరాయుళ్లు చిక్కుతారో అంత మొత్తం జరిమానా సంబంధిత యజమాని/నిర్వాహకుడికి విధిస్తారు.
♦ పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు. రెండోసారైతే రూ.5,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు.
♦ మైనర్లకు లేదా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే రూ.200.
♦ సర్టిఫైడ్ హెల్త్ వార్నింగ్ లేని ఉత్పత్తులు తయారు చేస్తే తొలిసారి రూ.5,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.10,000 జరిమానా లేదా ఐదేళ్ల జైలు.
♦ ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తే తొలిసారి రూ.1,000 జరిమానా లేదా ఏడాది జైలు. రెండోసారి రూ.3,000 జరిమానా లేదా రెండేళ్ల జైలు.
ముందు మనం మారాలి..
స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడంతో పాటు పోలీస్ విభాగాన్ని స్మోక్ ఫ్రీగా మార్చాలని నిర్ణయించాం. ఏళ్లుగా నేను, నా కుటుంబీకులు ఈ దురలవాట్లకు దూరంగా ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఇలానే మారాలి. సమాజ, నగర అభివృద్ధి సూచికల్లో ఆరోగ్యం కూడా ఒకటి. ఒకప్పుడు పంజాబ్‌లో అత్యధికంగా ఉన్న డ్రగ్ కల్చర్‌ను సామాన్యుల్లో అవగాహన పెంచడం ద్వారానే తగ్గించగలుగుతున్నారు. నగర పోలీస్ విభాగంలో ఉన్న ప్రతి అధికారి ప్రాథమికంగా తన చుట్టూ ఉన్న 100 మీటర్లతో ప్రారంభించి 500 మీటర్ల వరకు స్మోక్ ఫ్రీగా మార్చాలి. ప్రతి అంశంలోనూ పోలీసుల పాత్ర ఉన్నట్లే వారు ఆదర్శంగానూ మారాలి. – అంజనీకుమార్, కొత్వాల్
అదో సోషల్ స్టేటస్..
సిగరెట్ కాల్చడమనేది ఒకప్పుడు దుర్వ్యసనంగా ఉండేది. ఇప్పుడది ఓ సోషల్ స్టేటస్‌గా మారింది. ఈ కారణంగానే పాఠశాల, కళాశాల విద్యార్థులూ దీనికి అలవాటు పడుతున్నారు. ముందు సదరాగా మొదలెట్టి ఆపై బానిసలుగా మారుతున్నారు. సెలబ్రిటీలు ఎవరైనా సిగరెట్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తే వారిని అరెస్టు చేసే ఆస్కారం ఉంది. నగరంలో ఎవరైన అలా పట్టుబడాలన్నది నా కోరిక. – ఎం.శివప్రసాద్, అనదపు సీపీ
Comments
Please login to add a commentAdd a comment