
సాక్షి, భూపాలపల్లి/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మరో పండగకు సిద్ధమవుతోంది. బుధవారం మండమెలిగె పండగతో ప్రారంభమయ్యే మినీ జాతరలో వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో రెండు సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు.
పూర్తయిన ఏర్పాట్లు: భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి కోసం ఎనిమిది ట్యాంకర్లతోపాటు జాతర పరిసరాల్లో 80 చేతి పంపులను మరమ్మతు చేసి వినియోగంలోకి తెచ్చారు. తాత్కాలికంగా ఏడు రెడీమేడ్ మరుగుదొడ్లను సిద్ధం చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాలు అమర్చారు. చుట్టూ డెకరేషన్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో స్నాన ఘట్టాల వద్ద 15 షవర్లను బిగించారు. దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాటు చేశారు. జాతర జరిగే నాలుగు రోజులు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 14 ట్రాన్స్‌ఫార్మర్లను బిగించారు.
శానిటేషన్ పనులకు 100 మంది కూలీలు: పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో ఎక్కువగా వ్యర్థాలు పడేసే ఆరు ప్రాంతాలను గుర్తించామని, వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతామని డీపీఓ చంద్రమౌళి తెలిపారు. చెత్త డంపింగ్ కోసం తాత్కాలికంగా కుండీలను ఏర్పాటు చేశామన్నారు. 2017లో జరిగిన మినీ జాతర కంటే ఈసారి పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.
పోలీసుల శాఖ సమాయత్తం: జాతరలో 300 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో విశాలమైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment