మౌనమేల బాబు?
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యేకు ముడుపుల కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని.. నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ‘అన్నీ మేం చూసుకుంటాం. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఆంధ్రప్రదేశ్‌లో నామినేట్ చేస్తా’మని స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చిన ఆడియో రికార్డు ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కడియం శ్రీహరి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ నీతిబాహ్యమైన వ్యవహారం వెనుక చంద్రబాబు ఉన్నాడని మేం పూర్తిగా నమ్మాల్సి వస్తోంది. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన రేవంత్.. బాబు, బాస్, నాయుడు అని ప్రస్తావించారు. బాబు ఆదేశాలతోనే ఈ లావాదేవీ జరిగిందనడానికి ఇదే నిదర్శనం. బాబు కూడా భరోసా ఇచ్చారు.
అసలు ఈ ఎపిసోడ్‌తో తనకు సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు ఖండించడం లేదు. ఎలాంటి ప్రకటనా చేయడం లేదంటే చంద్రబాబు తన ప్రమేయాన్ని ఒప్పుకున్నట్లే. బాబు ఆదేశాలతోనే ఇది జరిగిందని నమ్ముతున్నాం’’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజలు ఛీకొట్టేలా టీడీపీ వ్యవహరించిందని, చంద్రబాబు రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు. ఏసీబీకి సాక్ష్యాధారాలతో దొరికిపోయి ఇంకా బుకాయిస్తూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
‘‘కేసీఆర్ కుట్ర పన్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే కేసీఆరే రూ.50లక్షలు రేవంత్‌కు ఇచ్చి స్టీఫెన్‌సన్ దగ్గరికి పంపించారా? ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు హస్తముందని టీడీపీ నాయకులందరికీ తెలుసు. ఏసీబీ విచారణలో అన్ని అంశాలూ వెలుగులోకి వస్తాయి..’’ అని కడియం పేర్కొన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిని ఎర్రబెల్లి తెలంగాణ ద్రోహులని విమర్శిస్తున్నారని.. ఆయన మతిభ్రమించిందని, తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీయేనని కడియం పేర్కొన్నారు. బాబు నిజస్వరూపం తెలిసే పార్టీ మారానని, ఎంపీ పదవికి త్వరలోనే రాజీనామా చేస్తానని కడియం చెప్పారు.
ఆ ఏడు మండలాలను ఎలా కలిపేసుకున్నారు: తుమ్మల
మాట్లాడితే తెలుగుజాతిని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబుకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండిపడ్డారు. తెలంగాణతో సఖ్యతగా ఉంటానని ప్రకటించే బాబు... జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్‌డే కంటే ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో ఎలా కలిపేసుకున్నారని నిలదీశారు. సీలేరు, కృష్ణపట్నం విషయంలో ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.
ఏపీ ప్రజలు తలదించుకునేలా బాబు ప్రవర్తన ఉందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే బాబు తత్వాన్ని అర్థం చేసుకుంటోందని తుమ్మల వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఏపీకి కావాలంటే సహాయ సహకారాలు అందిస్తామని, ఈ నీతిమాలిన చర్యలను మానుకోవాలని హితవు పలికారు.